నారా లోకేష్ శంఖారావం సభలలో అధిక సమయం వైసీపీని విమర్శించడానికే వెచ్చిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామన్నది చెప్పకుండా సీఎం జగన్ నుంచి మొదలుపెట్టి లోకల్ ఎమ్మెల్యే దాకా విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు.
దీని వల్ల లాభమేంటి అంటే అటు నుంచి అంతే స్థాయిలో ప్రతి విమర్శలు వస్తాయి. అలా రాజకీయ మాటల యుద్ధం తప్పించి టీడీపీ గ్రాఫ్ పెంచే విధంగా నారా లోకేష్ శంఖారావం ఉపయోగపడుతోందా అంటే ఆలోచించాల్సిందే.
అనకాపల్లికి వచ్చిన లోకేష్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ మీద విమర్శలు చేశారు. గుడ్డు మంత్రి అంటూ సంభోదిస్తూ కోడి గుడ్డు బహుమతి అని సభలో గొప్పగా ప్రకటించారు. అసలే మాటల మాటకరి అయిన గుడివాడ ఊరుకుంటారా. ఒక ముంతలో పప్పు ఉడకబెట్టింది తీసుకుని మీడియా ముందుకు వచ్చేశారు.
లోకేష్ కి ఈ పప్పు ముంత పంపుతున్నాను వచ్చి తీసుకోవాలని ఇదే తన రిటర్న్ గిఫ్ట్ అంటూ చినబాబుకు ఇవ్వాల్సింది ఇచ్చేశారు. పప్పులో గట్టిగా ఉత్తరాంధ్ర కారం, ఉప్పు దట్టించామని అది తిని అయినా చంద్రబాబు లోకేష్‌లకు రోషం పుట్టాలని గుడివాడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
లోకేష్ మాదిరిగా తాను బ్యాక్ డోర్ పొలిటీషియన్‌ని కాదు అని గుడివాడ సెటైర్లు వేశారు. శంఖారావం అన్న పదం కూడా సరిగ్గా పలకలేకపోతున్న లోకేష్ ఒక మొద్దబ్బాయ్ అని గాలి తీసేశారు. తాను ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డానో చెప్పాలని లోకేష్ కి సవాల్ విసిరారు.
అసలు పూరి గుడిసె నుంచి నీ కుటుంబం ప్యాలెస్ లోకి ఎలా ఎదిగిందో చెప్పు లోకేష్ అని రెట్టించారు. నా మీద అవినీతి ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణే ఏమీ చేయలేకపోయారు నీవెంత అంటూ గుడివాడ గట్టిగా తగులుకున్నారు. బంధుత్వాలు రక్త సంబంధాలు గురించి లోకేష్ మాట్లాడకపోవడమే మంచిది అని సూచించారు.
పవన్ సహా ఇతర రాజకీయ నాయకులు అంతా గతంలో చంద్రబాబు కుటుంబ బంధాలు గురించి ఎలా మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకో లోకేష్ అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి నెట్టారు. ఆ విషయాలు అన్నీ ప్రజలకు చెప్పు లోకేష్ అని డిమాండ్ చేశారు.
ఎర్ర పుస్తకం అంటూ ఒకటి పట్టుకుని తిరుగుతున్నావ్ కానీ అందులో మొదటి పేజీ కూడా తెరచే చాన్స్ నీకు కానీ చంద్రబాబుకు కానీ రానే రాదని తేల్చేశారు. 2019లోనే టీడీపీ కుర్చీలు మడత పెట్టామని, ఇపుడు ఎర్ర పుస్తకం కూడా లోకేష్ మడత పెట్టుకోవాల్సిందే అని సూచించారు.
సిద్ధం సభల తరువాత జనంతో జగన్ కి ఉన్న కనెక్షన్ ని ఎవరూ తెంచలేరు అని అర్థమైంది, అందుకే టీడీపీ లో ఫస్ట్రేషన్ కనిపిస్తోందని అన్నారు. ఐటీ పరిశ్రమల మంత్రిగా తాను ఏమి చేశానో టీడీపీ హయాంలో ఏమి జరిగిందో శ్వేత పత్రం రిలీజ్ కి తాను సిద్ధమని గుడివాడ అంటున్నారు. అలాగే వైసీపీ టీడీపీ ప్రభుత్వాల హయాంలో వచ్చిన పెట్టుబడుల మీద చర్చకు సిద్ధమని ప్రకటించారు.
గుడివాడను కెలికి ఇంతకీ లోకేష్ సాధించింది ఏంటి అంటే పప్పు ముంతను రిటర్న్ గిఫ్ట్ గా తెచ్చుకోవడమే అంటున్నారు.