వారాహి ఈ పేరు ఇపుడు బాగా వినిపిస్తోంది. వారాహి అని పవన్ కళ్యాణ్ తన వాహనానికి పెట్టుకున్నారు. దాన్ని నారాహిగా పెట్టుకోమని మంత్రులు అంటున్నారు. వారాహి రంగు గురించి ఎత్తు గురించి కూడా వ్యాఖ్యలు వచ్చాయి. అయినప్పటికీ తెలంగాణాలో ఆ వాహనం రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. కానీ తిరగాల్సింది మాత్రం ఏపీ రోడ్ల మీదనే.
అందుకే వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ అమెరికాలో వాహనం కొన్నా మరెక్కడ నుంచి తెచ్చినా ఏపీకి వస్తే మాత్రం ఇక్కడి రూల్స్ ప్రకారమే నడవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వారాహి వాహనం గురించి తాము ఆంధ్రా రూల్స్ చెప్పామని కానీ పవన్ తెలంగాణాలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
వారాహి నంబర్ 8384 అని, అన్నీ కలిపి కూడితే 23 వస్తుందని, అది చంద్రబాబుకు బాగా నచ్చే నంబర్ అని గుడివాడ సెటైర్లు వేశారు. అంటే వారాహి తో పవన్ టూర్లు చేయడం వెనక అర్ధం పరమార్ధం అన్నీ బాబు కోసమే అని మంత్రి గారు లోగుట్టు విప్పి మరోమారు చెప్పారన్నమాట.
వారాహి రిజిస్ట్రేషన్ హైదరాబాద్ లో చేయడానికి కారణాలు ఆయన చెప్పారు. పవన్ ఉండేది అక్కడే కాబట్టి ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించారు అని పవన్ మీద కామెంట్స్ చేశారు. విశాఖలో ఏ అభివృద్ధి కార్యక్రమం తలపెట్టినా అడ్డుకోవడమే టీడీపీ సహా ఇతర పక్షాల వంతు అని ఆయన నిందించారు.
రుషికొండ మీద ప్రభుత్వ భవనాలు తప్ప మరేమీ నిర్మాణం కావడంలేదని సీపీఐ నారాయణ చెప్పినా తెలుగుదేశం నాయకులు వినడం లేదు అంటే వారి కువిమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయో అని గుడివాడ మండిపడ్డారు. అమరావతి రాజధాని పేరుతో అక్కడ పర్యావరణం మొత్తం విద్వంశం చేసినా ఎవరి కళ్ళకు కనబడకపోవడం కంటే విడ్డూరం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ ముచ్చట్లు ఎలా ఉన్నా వారాహి ఏపీలో అడుగుపెడితే నిబంధనల పేరు మీద అడ్డుకుంటారా అన్నదే ఇపుడు చూడాలి.