‘అసలే ముక్కిడి ఆపై పడిశం..’ అన్న సామెత చందంగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అసలే తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ తీసికట్టు చందంగా తయారవుతోంది. ఇదివరకు బలం ఉన్న స్థానాల్లో కూడా ఇప్పుడు కనీస బలాన్ని నిరూపించుకోలేకపోతోంది. పార్టీ మొత్తం ముఠా కుమ్ములాటలతో సతమతం అవుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద నిందలు వేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సవాలక్ష చికాకులు ఉండగా.. టీపీసీసీకి కొత్త కమిటీలను వేయడం ద్వారా.. అధిష్ఠానం ముసలం పెట్టిందనే చెప్పాలి.
అసలే అది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అసంతృప్తులు, ముఠాలు మరింతగా రెచ్చిపోతున్నాయి. గత ఎన్నికలో గెలవకపోయినప్పటికీ.. పార్టీలో బలమైన నాయకురాలే అయిన కొండా సురేఖ తనకు ఇచ్చిన పదవి పట్ల అసంతృప్తితో రాజీనామా చేశారు. ఇప్పుడు మిగిలిన వారి వంతు కూడా వస్తోంది. పార్టీకి రాజీనామాలు చేసే స్థాయి వరకు ఇంకా రాలేదు గానీ.. ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారు.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు భట్టి విక్రమార్క.. కమిటీల కూర్పు మీద మెత్తమెత్తగానే నిప్పులు చెరిగారు. అనేకమంది నాయకులు తనను కలిసి ఈ కమిటీలు, పదవుల మీద అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలో ఎంతకాలంగా పనిచేస్తున్నా అవకాశం రాలేదని అనేకమంది వాపోతున్నట్లుగా ఆయన చెప్పారు.
ప్రతిసారీ కమిటీల కూర్పులో పీసీసీ చీఫ్ తో పాటు, సీఎల్పీ నాయకుడిని కూడా పిలుస్తారని, ఈసారి తనను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని భట్టి విక్రమార్క తన గోడు వెళ్లబోసుకుంటూ ఉండడం గమనార్హం. ఈ విషయం మాణిక్కం ఠాగూర్ ను అడిగి తేల్చుకోవాల్సి ఉందన్నారు. పార్టీకి పీసీసీ చీఫ్, సీఎల్పీ నాయకుడు ఇద్దరూ ముఖ్యమే అని ఆయన చెబుతున్నారు.
ఇండైరక్టుగా కాదు.. డైరక్టుగానే తనను పక్కన పెట్టేశారని మృదుస్వభావి అయిన భట్టి విక్రమార్క కూడా పార్టీ అధిష్ఠానం మీద ఆగ్రహం వ్యక్తంచేస్తుండడం గమనార్హం. అసలే తెలంగాణలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అందరినీ కలుపుకుని పోవాల్సిన సమయంలో.. కమిటీలతో పార్టీలో కొత్త ముసలం పెంచుతున్నారని పలువురు అంటున్నారు.
కాంగ్రెస్ నుంచి ఎందరు నేతలు వలసవచ్చినా సరే.. చేర్చుకుని.. తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి బిజెపి ఆశగా ఎదురుచూస్తోంది. ఆ మాటకొస్తే.. కాంగ్రెస్ ను బలహీనపరుస్తూ.. వలసవచ్చేవారిని అక్కను చేర్చుకోవడానికి భారాస కూడా సిద్ధమే.
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎందుకిలాంటి తప్పిదాలు చేస్తోందో అర్థం కావడం లేదు. పార్టీని మరింతగా నష్టపరిచే నిర్ణయాలు ఇవి అని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.