ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట ప్రకారం కాకుండా మంత్రి అంబటి రాంబాబు రివర్స్ బాట పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ప్రతి మీటింగ్‌లోనూ సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చడంలో పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు చూడమని చెబుతుంటారు. కేవలం పేదరికం, అర్హతే ప్రామాణికంగా ఎలాంటి సిఫార్సులు లేకుండా ప్రజానీకానికి సేవ చేస్తామని చెబుతున్న సంగతి తెలిసిందే.
పాలన కూడా అదే రీతిలో సాగుతోంది. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగేది. టీడీపీ అయితే చాలు అదే అర్హతగా చంద్రబాబు ప్రభుత్వం లబ్ధి కలిగించేది. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలు పకడ్బందీగా జరుగుతోంది. 2019లో ఓట్లు వేయని వాళ్లు కూడా వేసేలా పథకాలు అమలు నిష్పక్షపాతంగా జరగాలని జగన్ ఆకాంక్ష.
అయితే ఆయన కేబినెట్లోని మంత్రి అంబటి మాత్రం అందుకు విరుద్ధంగా సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పల్నాడు జిల్లా రాజుపాళెంలో మంత్రికి ప్రజల నుంచి సెగ తప్పడం లేదనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి రోడ్డు కావాలని అంబటిని అడిగారు. ఆ అడిగిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అని అనుచరులు చెప్పారు.
దీంతో మంత్రి ఇదే అదునుగా భావించి… మీరు తెలుగుదేశమా? అని ప్రశ్నిస్తూ అయితే రోడ్లు ఎట్లా వేస్తామన్నారు. గడపగడపకూ వెళ్లాలని జగన్ ఆదేశించడం వెనుక ఉద్దేశం… ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం. కానీ అంబటి మాత్రం జగన్ ఆశయానికి విరుద్ధంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.