ఏపీ సర్కార్ విద్యా వ్యవస్థలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వం మొదటి నుంచి విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాకు ఏపీ సర్కార్ పెద్ద పీట వేసింది.
అలాగే నాడు-నేడు పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ఇప్పటికే పాఠశాలల్లో గొప్ప మార్పు కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వ బడుల విలీనం చేపట్టింది. దీనిపై భారీ విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంస్కరణకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సంస్కరణల్లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి తరగతి నుంచి 9వ తరగతి వరకు రెండు సెమిస్టర్లు ఉండనున్నాయి. అలాగే 2024-25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో రెండు సెమిస్టర్‌ల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ కరికులం విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. తాజా సంస్కరణపై విద్యా సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, మేథావుల నుంచి ఎలా స్పందన వస్తుందో చూడాలి. ఉన్నత విద్యలో సెమిస్టర్ విధానం అమలవుతోంది. అయితే ఒకటో తరగతి నుంచే సెమిస్టర్ విధి విధానాలు ఎలా వుండనున్నాయో చూడాలి.