చంద్రబాబునాయుడు, లోకేశ్ రోజువారీ కార్యకలాపాలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫాలో అవుతున్నట్టుగా, మరే నాయకుడు లేరు. తండ్రీతనయులపై విమర్శలు చేయడానికి విజయసాయిరెడ్డి సబ్జెక్టుల కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం బెంగళూరులో నారా లోకేశ్‌ను కేజీఎఫ్ నటుడు యశ్ మర్యాద పూర్వకంగా కలవడాన్ని కూడా విజయసాయిరెడ్డి విడిచిపెట్టలేదు.
భేటీకి సంబంధించి విజయసాయిరెడ్డి మాటల్లో చెప్పాలంటే రాము పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ట్విటర్‌లో ఆయన షేర్ చేస్తూ తన వెటకారాన్ని ప్రదర్శించారు. వచ్చే నెలలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి తన మార్క్ పంచ్ విసిరారు.
“పప్పు పాదయాత్రకు జనాలు పోటెత్తాలంటే పాన్ ఇండియా మూవీ హీరోలను రప్పించాలి. ఉ(య)ష్! వాళ్లు రాకపోతే? హోటళ్లు, షూటింగ్ స్పాట్లకు ఏ దిగ్గజ దర్శకుడి రిఫరెన్సుతోనో లేకేషే వెళ్లి కలవాలి. ఛార్టర్డ్ ఫ్లైట్లు, కోట్లల్లో పారితోషికం అరేంజ్ చేయాలి. ఇదీ బొల్లి నాయుడు స్కెచ్”
పనిలో పనిగా చంద్రబాబును కూడా బొల్లినాయుడు అంటూ తిట్టారు. లోకేశ్‌ను ముద్దుగా పప్పు అంటూ దెప్పి పొడిచారు. లోకేశ్ పాదయాత్రకు పాన్ ఇండియా సినిమా హీరోలను రప్పించాలని వ్యంగ్యంగా అన్నారు. లేకపోతే లోకేశ్ పాదయాత్రకు జనమే రారని ఆయన చెప్పకనే చెప్పారు. లోకేశ్, చంద్రబాబుపై ట్విటర్ వేదికగా ఏవో విమర్శలు చేస్తూ… అదో తుత్తి అన్నట్టు విజయసాయిరెడ్డి ఆనందం పొందుతున్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్లపై వ్యతిరేక కామెంట్స్ కూడా ఆయనకు తగ్గట్టే ఉన్నాయి.