టీపీసీసీలో ముసలం పుట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సీనియర్ నేతలు మూకుమ్మడిగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇందుకు హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క్ నివాసం వేదికైంది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, భట్టి విక్రమార్క, మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. తమను కోవర్టులుగా రేవంత్‌రెడ్డి ఓ పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. మరీ ముఖ్యంగా తమను ఒరిజినల్‌గా కాంగ్రెస్‌గా, రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీని వలసవాదుల పార్టీగా సీనియర్ నేతలు అభివర్ణించడం గమనార్హం. సేవ్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీని నమ్ముకున్న నాయకులకు ఇటీవల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కమిటీల్లో అవకాశం రాకపోవడం తనకు మనస్తాపం కలిగించిందన్నారు. కమిటీల నియామకంలో తాను భాగస్వామ్యం కాలేదన్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సగానికి సగం పైగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకే చోటు కల్పించారని విమర్శించారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన నాయకుడు పార్టీని ఉద్ధరిస్తాడా? అని పరోక్షంగా రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య చేశారు. పార్టీని కాపాడుకునేందుకు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలంతా సమావేశం అయ్యినట్టు ఆయన తెలిపారు. గతంలో కాంగ్రెస్ నాయకులు చేయలేనిది, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఏం చేస్తారని ప్రశ్నించారు.
మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు సోషల్ మీడియాలో తమను తప్పు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు పార్టీల్లో తిరిగి వచ్చిన చరిత్ర తమది కాదని పరోక్షంగా రేవంత్‌ను దెప్పి పొడిచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో తన కుటుంబానికి వున్న సుదీర్ఘ అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. ప్రాణం పోయేంత వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతామన్నారు. రేవంత్‌రెడ్డిపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ తీవ్ర వ్యాఖ్య చేశారు. క్యారెక్టర్ లేని వాళ్లు పార్టీని నడుపుతున్నారని రేవంత్‌పై ధ్వజమెత్తారు. వలస వచ్చినోళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు పంచాయితీ వచ్చిందన్నారు. ఇదంతా పార్టీని నాశనం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో తమకు ఏంటీ దుస్థితి అని ఆవేదనతో ప్రశ్నించారు. సీఎం జిల్లాలో పార్టీని కాపాడుకోవడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు. తమను కోవర్టులుగా సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నా టీపీసీసీ, ఏఐసీసీ నేతలు ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో సమాధి కట్టేందుకు నాయకులంతా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అంతర్గత కుమ్ములాటలు మరింత బలహీనపరిచేలా చేస్తున్నాయనడంలో సందేహం లేదు.