‘అధికారాంతమునందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అనేది ఒక సామెత. ఎవరి వైభవమైనా చూడాలంటే.. అధికారంలో ఉన్నప్పుడు చూసేందుకు ఏముంటుంది.. అందరూ వాళ్ల పట్ల వినయవిధేయతలతో మెలగుతుంటారు. ఆ అధికారం పోయిన తర్వాత చూస్తే.. వారికి ఎంత మర్యాద ఉందో అప్పుడు నికార్సుగా తెలుస్తుంది అనేది ఈ పద్యపాదం యొక్క తాత్పర్యం. ఆ తరహాలో.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యొక్క అసలైన కుట్ర బుద్ధులను, కుత్సితాలను చూడాలంటే.. ఆయన అధికారంలో లేని సమయంలోనే చూడాలి.
రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చడానికి ఆయన ఏ రకంగా ప్రతి చిన్న ఊర్లోనూ కక్షలను కార్పణ్యాలను ఎగదోస్తూ ఉంటారో.. అశాంతిని రగిలించడానికి పాటుపడుతుంటారో.. ఫ్యాక్షన్స్ లో ఆజ్యం పోసి తాను వినోదం చూస్తుంటారో.. ఊరూ వాడా తగలబడిపోతూ ఉంటే తాను చలికాచుకునే ప్రయత్నం చేస్తారో.. పల్లెల్లో పట్టణాల్లో ఫ్యాక్షన్లు, కక్షల జ్వాలలు రగులుతుంటే మాత్రమే తనకు అస్తిత్వం ఉంటుందని..ఆయన ఆలోచిస్తుంటారో మనకు అర్థమవుతుంది.
రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే.. తన అస్తిత్వానికి ప్రమాదం అని చంద్రబాబునాయుడుకు భయం! తనను ఎవరూ పట్టించుకోరు అని ఆయనకు చింత! అందుకే తాను అధికారంలో లేకపోతే చాలు.. ప్రతి చోటా ఫ్యాక్షన్లను కక్షలను ఎగదోయడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తుంటారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటారు. తాజాగా మాచర్ల విధ్వంసాన్నే పరిశీలిద్దాం..
జూలకంటి బ్రహ్మారెడ్డి అంటే మాచర్లలో కరడుగట్టిన ఫ్యాక్షన్ లీడర్. తాను, తన పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఆ బ్రహ్మారెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జి పదవిని కట్టబెట్టాడు చంద్రబాబునాయుడు. ఆ పదవిని ఇవ్వడమే పెద్ద కుట్ర. మాచర్ల ప్రశాంతంగా ఉండకుండా.. రావణకాష్టంలా రగులుతూ ఉండాలని ఆయన వేసిన స్కెచ్ అది. ఆ స్కెచ్ ఇవాళ్టికి ఫలించింది. శుక్రవారం నాటి సంఘటనల్లో కూడా.. తమ కాలనీలో సమస్యలు లేవు అని ఎవరైనా చెప్పినప్పుడు.. సమస్యలు వినడానికి వెళుతున్న తెలుగుదేశం నాయకులు అక్కడితో దారి మళ్లి.. మరో కాలనీకి వెళ్లాలి. కానీ.. కావాలనే రెచ్చగొట్టే చర్యలకు దిగారు.
ఈనాడులో వచ్చిన వార్తను జాగ్రత్తగా చదివితే చాలు.. వడ్డెర కాలనీ వద్ద రభస జరిగినప్పుడు.. బ్రహ్మారెడ్డిని కేవలం వెనక్కు నెట్టినందుకు.. ఆయన మనుషులు.. టీడీపీ గూండాలు కర్రలతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారని అర్థమవుతుంది. ఒకసారి అలా నిప్పు ముట్టించిన తర్వాత.. ఇక అది రోజంతా రగులుతూనే ఉండిపోయింది. ముందు తెలుగుదేశం వారి దాడి, తర్వాత వైసీపీ వారి ప్రతి దాడి.. ఈ ఘర్షణలు అలా చెలరేగాయి.
కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది చంద్రబాబునాయుడు కుట్రబుద్ధి గురించి. బ్రహ్మారెడ్డి స్థానికంగా అత్యంత ప్రమాదకరమైన ఫ్యాక్షన్ నాయకుడు అనే సంగతి ఆయనకు తెలుసు. అయినా అదే అర్హతగా పరిగణిస్తూ ఆయనకు ఇన్చార్జి పదవి ఇచ్చారు. చంద్రబాబు వ్యూహాలు, తీరుతెన్నులే అంత. కేవలం మాచర్ల విషయంలో మాత్రమే కాదు.. గురజాలలో సైతం మైనింగ్ డాన్, ఫ్యాక్షన్ లీడరుగా ముద్ర ఉన్న యరపతినేని శ్రీనివాసరావు చేతిలోనే పార్టీ పగ్గాలు పెట్టి ఎగదోస్తుంటారు.
ఇక నరసరావుపేటలో కోడెల కుటుంబానికి ఉన్న ఫ్యాక్షన్ చరిత్ర జగద్విదితం. అనంతపురం జిల్లాలో గమనించినా.. పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలను చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తూ వస్తుంటారు. అదే సమయంలో.. వారి ప్రత్యర్థి మద్దెలచెరువు సూరి కుటుంబం నుంచి ఫ్యాక్షన్లు కొనసాగకుండా వైఎస్ జమానాలోనే ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. కానీ.. వాతావరణం అలా ప్రశాంతంగా మారిపోవడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అందుకే ప్రతి చోటా కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేతలు దొరికితే చాలు వారిని అక్కున చేర్చుకుని, పార్టీ పదవులతో ప్రోత్సహిస్తుంటారు.
వారు స్థానికంగా అల్లకల్లోలం సృష్టించేస్తుండాలి.. అధికార పార్టీ మమ్మల్ని బతకనివ్వడం లేదు.. మామీద దాడులు చేస్తున్నది అంటూ గోలగోల చేయాలి. ఆ రకంగా ఏదో జరిగిపోతున్నదనే భ్రమలను వ్యాప్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా సానుభూతి పొందాలి. ఇదే కుట్ర వ్యూహాలతోనే చంద్రబాబు రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు.
మాచర్లలో రావణకాష్టం రగిలించిన తర్వాత.. ఇప్పుడు అచ్చెన్న, లోకేష్ లాంటి వందిమాగధులంతా రంగప్రవేశం చేస్తున్నారు. బాబుకుట్రలకు తందానా అంటూ వంత పాడుతున్నారు. అంతుచూస్తాం.. తేలుస్తాం అంటూ ఉత్తరకుమార ప్రగల్భాలతో రంకెలు వేస్తున్నారు.
చంద్రబాబునాయుడు కుట్రరాజకీయాలకు పరాకాష్ట మాచర్ల ఎపిసోడ్. రాష్ట్రం మొత్తం ఇలాగే రావణ కాష్టంలా తగలబెట్టేసి.. తద్వారా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి, సానుభూతి పొంది అధికారంలోకి రావాలనేది ఆయన అసలు వ్యూహం. ఈ కుత్సితాలను ప్రజలు గుర్తించారంటే మాత్రం.. వారి ఛీత్కారం ఇంకో రేంజిలో ఉంటుందని ఆయన తెలుసుకోవాలి.