స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అనేది లేనే లేదు అంటూ పచ్చవర్గాలు తెగ వాదిస్తూ ఉన్నాయి. ఈ కేసులో చంద్రబాబు అరెస్టు అయినా, ఆయన క్వాష్ పిటిషన్ తిరస్కరణకు గురైనా, చంద్రబాబు నాయుడును సీఐడీ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అంగీకరించిన తర్వాత కూడా.. అసలు స్కామే లేదనే వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి!
మరి చంద్రబాబు సంగతలా ఉంటే.. ఈ కేసులో నిందితులు, వారితో సంబంధం ఉన్న వారు ఒక్కొక్కరుగాపరారీ అవుతూ ఉండటం గమనార్హం. ఇప్పటికే పరార్ అయిన వారికి తోడు నారా లోకేష్ పీఏ కిలారు రాజేష్ చౌదరి కూడా ఈ జాబితాలో చేరినట్టుగా తెలుస్తోంది.
స్కిల్ స్కామ్ లో నారా లోకేష్ ప్రమేయం కూడా ఉందని సీఐడీ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంగా లోకేష్ ను కూడా విచారించే అవకాశాలున్నట్టున్నాయి. దాన్ని తప్పించుకోవడానికే లోకేష్ ఢిల్లీలో ఉన్నారని.. ఇటు వైపు వస్తే అరెస్టు చేస్తారనే భయంతో ఆయన అక్కడ కూర్చున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.
ఇంతలో నారా లోకేష్ పీఏ ఢిల్లీ నుంచి దేశం దాటినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిధులను దారి మళ్లించడంలో లోకేష్ కు ప్రమేయం ఉందని సీఐడీ చెబుతోంది. ఇలాంటి నేపథ్యంలో లోకేష్ పీఏ పరారీ కావడం ఆసక్తిదాయకంగా మారింది. ఢిల్లీకి అంటూ లోకేష్ వెంట వెళ్లిన రాజేష్ చౌదరి, అక్కడి నుంచినే అమెరికా పారిపోయాడట!
ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు పరారీలో ఉన్నారు. ఒకరు అమెరికా, మరొకరు దుబాయ్ పారిపోయారని సీఐడీ కోర్టు నివేదించింది. ఇప్పుడు లోకేష్ పీఏ పరారీ కావడం గమనార్హం. మరి స్కామే జరగనప్పుడు ఈ పరారీల మాటేంటి? 371 కోట్లా.. అదో చిల్లర అని వాదిస్తారు, ఇంకో వైపు పరార్ అవుతారు!