స‌ర్కార్‌కు హైకోర్టులో మ‌ళ్లీ చుక్కెదురు

తెలంగాణ స‌ర్కార్‌కు మ‌రోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు ద‌ర్యాప్తున‌కు సంబంధించి సీబీఐ ద‌ర్యాప్తున‌కు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ తెలంగాణ స‌ర్కార్ డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇవాళ…

తెలంగాణ స‌ర్కార్‌కు మ‌రోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు ద‌ర్యాప్తున‌కు సంబంధించి సీబీఐ ద‌ర్యాప్తున‌కు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ తెలంగాణ స‌ర్కార్ డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇవాళ కీల‌క తీర్పు వెలువ‌డింది. తెలంగాణ స‌ర్కార్‌కు కోరుకున్న‌ట్టుగా డివిజ‌న్ బెంచ్ తీర్పు లేదు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల‌పై జోక్యం చేసుకునేందుకు డివిజ‌న్ బెంచ్ నిరాక‌రించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారాన్ని విచారించే బాధ్య‌త‌ల్ని సీబీఐకు అప్పగించ‌డాన్ని స‌వాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి , తెలంగాణ స‌ర్కార్ దాఖలు చేసిన అప్పీళ్లను న్యాయస్థానం కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు స‌క్ర‌మంగానే ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డింది. 

అయితే డివిజ‌న్ బెంచ్‌పై సుప్రీంకోర్టుకు వెళ్ల‌డానికి గ‌డువు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ కోరారు. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించే వ‌ర‌కూ ఆర్డర్‌ను సస్పెండ్ లో ఉంచాలని ఏజీ కోరారు. ఇందుకు  హైకోర్టు నిరాకరించింది.

తెలంగాణ‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లో బీజేపీని బుక్ చేయాలనుకున్న కేసీఆర్ స‌ర్కార్ …అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డంలో స‌క్సెస్ కాలేదు. చివ‌రికి ఈ వ్య‌వ‌హారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెడ‌కే చిక్కుకునేలా వుంది. ఈ పొలిటిక‌ల్ గేమ్‌లో చివ‌రికి ఫ‌లితం ఏంట‌నేది ఉత్కంఠ క‌లిగిస్తోంది.