గుట్టు విప్పని మాజీ ఐపీఎస్ అధికారి

ఐఏఎస్ అధికారులు కావొచ్చు, ఐపీఎస్ అధికారులు కావొచ్చు రాజకీయాల్లోకి రావడం చాలా సాధారణమైపోయింది. కొందరు సర్వీసు మధ్యలోనే వస్తుండగా, కొందరు ఉద్యోగ విరమణ తరువాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. కానీ వీరి సక్సెస్…

ఐఏఎస్ అధికారులు కావొచ్చు, ఐపీఎస్ అధికారులు కావొచ్చు రాజకీయాల్లోకి రావడం చాలా సాధారణమైపోయింది. కొందరు సర్వీసు మధ్యలోనే వస్తుండగా, కొందరు ఉద్యోగ విరమణ తరువాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. కానీ వీరి సక్సెస్ రేటు చాలా తక్కువనే చెప్పుకోవాలి. 

పదవుల సంగతి పక్కనపెడితే ఎన్నికల్లో గెలవడం కూడా చాలా కష్టంగా ఉంది. నిజాయితీపరుడిగా, మేధావిగా పేరున్న లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ సంప్రదాయ రాజకీయాలు కాకుండా కొత్త రాజకీయాలు చేస్తానని పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అద్భుతమైన ఆలోచనలు చేశారు. యువతను విపరీతంగా ఆకర్షించారు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత తెరమరుగైపోయారు.

ఆయన కొత్త తరం రాజకీయాలను పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఆయన తరువాత తెలుగువారికి సుపరిచితుడైన ఉన్నత పోలీసు అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ఒకప్పటి అక్రమాస్తుల కేసును ఈయనే దర్యాప్తు చేసిన సంగతి, జగన్ ను జైలుకు పంపిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ఈయన పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఈయనకు కూడా నిజాయితీ పరుడనే పేరుంది. విలువలు, ఆదర్శ భావాలున్న వ్యక్తి అంటారు. 

రాజకీయాల్లోకి రావాలనే కోరికతో గత ఎన్నికలప్పుడు జనసేన పార్టీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఎదుగుతాడని చాలామంది భావించారు. కానీ పవన్ తో విభేదించి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో మాత్రం చెప్పడంలేదు. దాన్ని గుట్టుగా ఉంచుతున్నారు. ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని గట్టిగా చెప్పడంలేదు. తాను విశాఖ నుండి పోటీకి దిగుతున్నాను అని మాత్రమే అంటున్నారు.  

మీడియావారు రోజుకో పార్టీలో తనను చేరుతున్నారని, తన భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుండి పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఈమధ్య ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వేర్వేరుగా భేటీ అవడం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశాలు రాజకీయాల్లో కలకలం రేపాయి. విశాఖలో ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన వివేకానంద.. అక్కడ గంటా, లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు నేతలతో భేటీ అయ్యారు. 

ఈ సమావేశంలో బీఆర్ఎస్ లో చేరాలని వివేకానంద వారిని ఆహ్వానించిట్లుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని గంటా, లక్ష్మీనారాయణలు తోసిపుచ్చారు. తమ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు. లక్ష్మీనారాయణ జనసేన నుంచి బయటకు వచ్చేశాక ఏ పార్టీ వైపు మొగ్గచూపలేదు. విశాఖ నుంచే నేను ఎంపీగా పోటీ చేస్తాను, అది ఏ పార్టీ అనేది ఇప్పుడే చెప్పలేను అని లక్ష్మీనారాయణ గతంలో కూడా అన్నారు. ఇప్పటికీ అదే చెబుతున్నారు. మరి ఆయనకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా ఉందా?