దశాబ్దాలుగా కాషాయ జెండాలను మోసిన వారు ఒకవైపు, అవసరం కోసం కాషాయ చొక్కాలు కుట్టించుకున్న వారు మరోవైపు! ఖాకీ నిక్కర్లు ధరించి సిద్ధాంతాల మేరకు పార్టీలో పని చేస్తూ వచ్చిన వారు ఒకవైపు, తెలుగుదేశం అధికారం కోల్పోవడంతో కమలం పార్టీని అవసరం మేరకు వాడుకుంటున్న వారు మరోవైపు! ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో బీజేపీకి పొత్తు కుదరడంతో వలస పక్షులు ఉత్సాహపడుతున్నాయి! తెలుగుదేశం పార్టీతో పొత్తే ఇష్టం లేదు పాతకాపులకు! ఇప్పుడు వారి పుండు మీద కారంలా.. టికెట్లు కూడా అన్నీ వలస పక్షులే తన్నుకుపోయేలా ఉన్నాయి!
విశాఖ నుంచి హిందూపురం వరకూ .. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో వలస పక్షుల పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం ద్వారా దక్కాల్సిన టికెట్లు అన్నీ బీజేపీ ద్వారా దక్కుతున్నాయి వలస పక్షులకు!
ఇలాంటి నేపథ్యంలో.. ఈ దృశ్యాలను చూడలేక పాత కాపులంతా వెళ్లి అధిష్టానానికి మొరపెట్టుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తం ముప్పై మందితో ఒక బ్యాచ్ వెళ్లి.. టికెట్లన్నీ వలస పక్షులకు దక్కుతున్నాయని, ఏపీ బీజేపీ మరోసారి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన వితంతు పునరావస కేంద్రం అయిపోతుందనే ఆవేదనను వారు వ్యక్తం చేయనున్నారట!
అయితే వీరి ఆవేధనను వినేంత తీరిక ఢిల్లీకి ఉందా! ఏపీ నుంచి ఒకటీ అర సీట్లు వస్తే వచ్చేయానే లెక్కలే కమలం పార్టీ అధిష్టానం వద్ద ఉన్నాయి తప్ప, అంతకు మించిన వ్యూహాలు లేవని టీడీపీతో ఆ పార్టీ పొత్తుతే క్లారిటీ వచ్చింది! దశాబ్దాలుగా ఏ పార్టీతో పొత్తుతే అయితే కమలం ఏపీలో కుంచించుకుపోయిందో, ఇప్పుడు అదే పార్టీ తన అవకాశవాదంతో మరోసారి స్నేహహస్తం అందిస్తే దానికే కమలం పార్టీ అధిష్టానం మురిసిపోతోంది! అలాంటప్పుడు పాత కాపుల ఘోష ఏం అర్థం అవుతుంది?
అంతే కాదు.. పొత్తు చర్చల్లో భాగంగా చంద్రబాబు గట్టి కండీషన్లు పెట్టారట! ఏపీ బీజేపీ నేతల్లో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు ఉన్నారని, వారికి టికెట్లు ఇవ్వొద్దంటూ గట్టిగా చెప్పారట! అయిన వలస పక్షులన్నింటినీ తనే బీజేపీలోకి పంపి, పాత కాపులను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అంటూ ముద్ర వేయడం చంద్రబాబుకే సాధ్యం అయినట్టుగా ఉంది. టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి వచ్చిన చంద్రబాబు అనుకూల వలస పక్షులకు తప్ప వేరే వాళ్లకు టికెట్లు కూడా దక్కే పరిస్థితి అయితే ఏపీ బీజేపీలో ఇప్పుడు కనిపించడం లేదు!