ఏపీలో సిట్ బృందం దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన హింసాయుత ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. దీంతో గొడవలకు కారణమైన వివిధ స్థాయిల్లోని అధికారులపై సీఈసీ వేటు వేసింది. అలాగే విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. 13 మంది అధికారుల బృందంతో ఏర్పాటైన సిట్ తన దర్యాప్తును వేగంగా చేస్తోంది.
తిరుపతి, తాడిపత్రి, అలాగే పల్నాడు జిల్లాలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. గొడవలు జరిగిన ప్రాంతాలను సిట్ అధికారులు పరిశీలించి, వాటికి కారణాలు, ఎవరెవరి హస్తం వుందనే అంశాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుండగా ఆదివారమే ఎన్నికల సంఘానికి సిట్ నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం.
అల్లర్లపై కొత్తగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అలాగే సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా అల్లర్లకు కారణమైన వ్యక్తులను గుర్తించి, అరెస్ట్ కూడా చేసినట్టు పోలీస్ అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల నిందితులు ఊళ్లు వదిలి పరారయ్యారు.
ఎన్నికల్లోనూ, అలాగే అనంతరం హింసాయుత ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా వుండడం పోలీస్ అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన పరిస్థితి. దీంతో ఎవరి కోసమో తమ ఉద్యోగాలు పోగొట్టుకోలేమని నిర్మొహమాటంగా తేల్చి చెబుతున్నారని తెలిసింది. సిట్ నివేదికపై ఉత్కంఠ నెలకుంది.