కేంద్రప్రభుత్వం అంటే అన్ని రాష్ట్రాలకు నిధులు పంచుతూ ఉంటుంది. ఆ దామాషాలో రావాల్సినవి దక్కడమే తప్ప.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ సర్కారు గత ఎనిమిదిన్నరేళ్లలో ఏం చేసింది? ఈ ప్రశ్న అడిగితే.. మాటల గారడీల్లో ఆరితేరిపోయిన కమలనాయకులందరూ కొండవీటి చేంతాడంత లిస్టులు చదవుతారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా కేంద్రం నుంచి రావాల్సినవి ఎంత మేరకు దక్కాయి.. అని అడిగితే కూడా.. అర్థసత్యాలను పోగుచేసి.. మరో కొండవీటి చేంతాడును వినిపిస్తారు. కానీ.. ప్రత్యేకహోదా, పోలవరం డ్యామ్, రైల్వేజోన్ ఇలా.. ఒక్కటొక్కటిగా అంశాలవారీగా గణాంకాల సహితంగా ప్రశ్నిస్తే మాత్రం పలాయనం చిత్తగిస్తారు. అలాంటి కమలదళం మళ్లీ ఇప్పుడు ఊకదంపుడు మాటలతో మరో నయావంచనకు ప్రయత్నిస్తోంది.
ఆపార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. అమరావతి పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓర్వ లేకపోతున్నారు. ఆ పాదయాత్రను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని సెలవిస్తున్నారు. అమరావతి రాజధానికి తాము తొలినుంచి మద్దతు ఇస్తున్నామని చెబుతున్నారు. ఇంతకూ రైతులు సాగిస్తున్న పాదయాత్రను కంటికి రెప్పలా కాపాడుకోవడం అంటే ఏమిటి? కేంద్ర మిలిటరీ బలగాలతో పాదయాత్రకు రక్షణ కల్పిస్తారా? లేక, తమ పార్టీ తరఫున బజరంగదళ్ అతివాద కార్యకర్తలందరినీ వారికి రక్షణగా యాత్రకు సెక్యూరిటీగా పాల్గొనమని పంపుతారా? అనేది క్లారిటీ లేదు.
అమరావతి యాత్ర జరుగుతూ ఉంటే దానిని సొంతం చేసుకోవడానికి భాజపా చేస్తున్న కుటిలయత్నాల్లో ఇది కూడా ఒకటని ప్రజలు భావిస్తున్నారు. అమరావతి విషయంలో తొలినుంచి నాటకాలు ఆడుతూ వచ్చిన భారతీయ జనతా పార్టీ.. తిరుపతికి రైతులు పాదయాత్ర చేస్తున్న సమయంలో మాత్రమే హఠాత్తుగా వారి మీద ప్రేమ కురిపించడం మొదలుపెట్టింది. అది కూడా.. అమరావతికి అనుకూల తీర్మానం చేసిన తర్వాత.. పాదయాత్రలో పాల్గొనక పోతే ఎలా.. అంటూ నాయకులకు అమిత్ షా అక్షింతలు వేసిన తర్వాతనే జరిగింది.
చాన్సు వచ్చినప్పుడెల్లా అమరావతికి మా మద్దతు, పాదయాత్రకు మా మద్దతు అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప.. బిజెపి అమరావతి కోసం, అసలు ఏపీ కోసం ఏం చేస్తోంది? పోలవరం మొత్తం పడకేయడానికి నిధుల విడుదల విషయంలో మీనమేషాలు లెక్కించే బీజేపీ సర్కారు పాత్ర ఎంత? రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఏమైంది.
అమరావతి రాజధాని అనే మాట విషయంలో.. వారు ఏం ప్రత్యేక నిధులు ఇచ్చారు? అనేవి ప్రజల మదిలో మెదలుతున్న ప్రశ్నలు. ఈ నాటకాలను కట్టిపెట్టి కమలదళం ఏదో ఒక రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిత్తశుద్ధి గల మేలు చేస్తే తప్ప.. ఏపీ ప్రజలు వారిని ఎప్పటికీ విశ్వసించరు అని తెలుసుకోవాలి.