అశోక్ పంతం పట్టారా?

పూసపాటి రాజులకు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరే సంస్థానాధీశులకూ లేవు. వందల ఏళ్ళ చరిత్ర వారిది. ఆధునిక యుగంలో ప్రజాస్వామిక రాజకీయాల్లో కూడా దశాబ్దాలుగా రాణించిన పూసపాటి వారికి ఈసారి ఎన్నికలు…

పూసపాటి రాజులకు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరే సంస్థానాధీశులకూ లేవు. వందల ఏళ్ళ చరిత్ర వారిది. ఆధునిక యుగంలో ప్రజాస్వామిక రాజకీయాల్లో కూడా దశాబ్దాలుగా రాణించిన పూసపాటి వారికి ఈసారి ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయేవిగానే ఉన్నాయని అంటున్నారు.

తాను పోటీ నుంచి తప్పుకుని కుమార్తె అదితి గజపతిరాజుని విజయనగరం నుంచి పోటీకి పెట్టారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఈ సీటుని ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగింది. ఉత్తరాంధ్రలో దాదాపుగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరినీ దారికి తెచ్చిన చంద్రబాబు లోకేష్ మీసాల గీత విషయంలో ఫెయిల్ అయ్యారా అంటే వారు కానే కాదు అన్నది మరో వార్తగా ఉంది.

ఒక దశలో మీసాల గీత పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడింది. అయితే అశోక్ గజపతిరాజు ఫోన్ చేసి అయినా తన సాయం అర్ధించాలని ఆమె ఒక కండిషన్ పెట్టిందని అంటున్నారు. దానికి రాజు గారు అంగీకరించలేదుట. పైగా ఓటమిని అయినా స్వీకరిస్తాను కానీ అని పంతానికి పోయారుట. దాంతో గీత పోటీకి సై అన్నారు. టీడీపీ అధినాయకత్వం కూడా ఏమీ చేయలేక పోయింది అని అంటున్నారు.

బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గీత 2009లో ప్రజారాజ్యం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పోటీ చేసి దగ్గరలోనే ఓటమి చూసారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి ఆమెకు గాజు గ్లాస్ గుర్తు లభించింది. దాంతో పాటు ఆమెకు తెర వెనుక నుంచి బలమైన రాజకీయ సాయమే లభించింది అని పోలింగ్ అనంతరం అంచనాలు బట్టి తెలుస్తోంది.

తూర్పు కాపు మొత్తం ఓటర్లలో మూడవ వంతు ఉండడం గాజు గ్లాస్ గుర్తుతో తేలికగా జనంలోకి పోవడంతో పాటు ఆమె ప్రత్యర్ధులు ఇద్దరూ అగ్ర వర్ణాల వారు కావడం గీతకు ప్లస్ పాయింట్లు అయ్యాయని అంటున్నారు. ఈ జోరులో ఆమె గెలిచినా గెలుస్తారు అని అంటున్నారు.

అయితే పెద్దాయన రాజు గారు పంతానికి పోయి తన కుమార్తె రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టారా అనన్ చర్చ సాగుతోంది. అదితి గజపతి ఈసారి ఓడితే పూసపాటి వంశీకుల రాజకీయం దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు.