ఇద్దరు మంత్రులలో ఎవరికి అగ్ర తాంబూలం?

వైసీపీ గెలిస్తే పాలన అంతా విశాఖ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నది అందరికీ తెలిసిందే. జగన్ ఈ సంగతి ఎపుడో చెప్పేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. ఎన్నికల సభలలోనూ జగన్ అదే మాట అంటూ…

వైసీపీ గెలిస్తే పాలన అంతా విశాఖ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నది అందరికీ తెలిసిందే. జగన్ ఈ సంగతి ఎపుడో చెప్పేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. ఎన్నికల సభలలోనూ జగన్ అదే మాట అంటూ వచ్చారు.  రెండోసారి గెలుపు మీద వైసీపీ పూర్తి ధీమాతో ఉంది. జూన్ 9న విశాఖలో జరిగే కార్యక్రమంలో జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానికి సంబంధించిన హడావుడి కూడా మొదలైంది.

వైసీపీ గెలిస్తే రెండవ మాట లేకుండా విశాఖ నుంచే పాలన మొదలవుతుంది. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుగా రుషికొండ బిల్డింగ్స్ సిద్ధంగా ఉన్నాయి. విశాఖకే ప్రభుత్వం వస్తే ఉత్తరాంధ్ర నుంచి ఎవరికి అగ్ర తాంబూలం ఇస్తారు అన్న డిబేట్ అయితే పార్టీలో నడుస్తోంది.

సీనియర్ మోస్ట్ లీడర్లు ఇద్దరు మంత్రులుగా బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు జగన్ ప్రస్తుత క్యాబినెట్ లో ఉన్నారు. మళ్ళీ జగన్ గెలిస్తే ఈ ఇద్దరికీ బెర్తులు ఖాయం చేస్తారా చేస్తే ఏ శాఖలు ఇస్తారు అన్నది కూడా చర్చనీయాంశం అవుతోంది. ఉత్తరాంధ్ర నుంచి జగన్ పాలన చేయాలనుకున్నపుడు మంత్రులుగా బొత్సను ధర్మానను కంటిన్యూ చేస్తారు అని అంటున్నారు.

అయితే ఇక్కడ అగ్ర తాంబూలం బొత్సకే కొంత దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ నుంచి ఎంపీగా గెలిస్తే బొత్స హవాకు తిరుగు ఉండదని అంటున్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని చూపిస్తున్న బొత్స విశాఖలోనూ తన సత్తా చాటుకుంటారు అని అంటున్నారు.

బొత్స కుటుంబానికి నాలుగు టికెట్లు ఇచ్చిన జగన్ రానున్న రోజుల్లో కూడా ఆయనకు పెద్ద పీట వేయడం ఖాయమని బొత్స అనుచర వర్గం ధీమాగా ఉంది. ధర్మాన విషయంలోనూ జగన్ తక్కువ చేయరని ఉత్తరాంధ్రలో ఆయనకు ఇవ్వాల్సిన  ప్రయారిటీ ఇస్తారని అంటున్నారు. ఈ ఇద్దరు మంత్రులూ ఉత్తరాంధ్రలో రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారు కావడమే కాదు సీనియర్లుగా ఉంటూ వస్తున్నారు ఉత్తరాంధ్రలో వైసీపీ రాజకీయంగా సామాజికంగా కూడా మరింత పటిష్టం కావాలంటే ఈ ఇద్దరూ జగన్ క్యాబినెట్ లో ఉండి తీరాల్సిందే అని అంటున్నారు.