డేట్ వదిలిన గంటా… బాబు ఓకేనా?

వైసీపీ తమ నాయకుడు వైఎస్ జగన్ జూన్ 9న రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని ప్రకటించింది. వైసీపీ నేతలు అది తమకు ఉన్న విశ్వాసం తప్ప అతి విశ్వాసం కాదని స్పష్టంగా…

వైసీపీ తమ నాయకుడు వైఎస్ జగన్ జూన్ 9న రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని ప్రకటించింది. వైసీపీ నేతలు అది తమకు ఉన్న విశ్వాసం తప్ప అతి విశ్వాసం కాదని స్పష్టంగా చెబుతున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి వైవీ సుబ్బారెడ్డి సజ్జల రామక్రిష్ణా రెడ్డి దాకా అంతా మేమే రెండవసారి అధికారంలోకి వస్తున్నామని ప్రకటించారు.

టీడీపీ నుంచి ఈ తరహా ధీమాతో కూడిన ప్రకటనలు అయితే రావడం లేదు అని అంటున్నారు. అయితే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఒక డేట్ ఇచ్చేశారు. ఆ రోజున చంద్రబాబు సీఎం గా ప్రమాణం చేస్తారు అని కూడా ప్రకటించేశారు. పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 9న సీఎం గా బాధ్యతలు స్వీకరించేది బాబే అని అంటున్నారు. వైసీపీ నేతలను కూడా బాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తామని గంటా చెబుతున్నారు.

టీడీపీలో అందరి కంటే ముందు గంటా ఈ విధంగా ప్రకటించడం వెనక వ్యూహం ఏమిటి అంటే ఆయన మంత్రి సీటు కోసమే అని సొంత పార్టీలోని ప్రత్యర్ధులే అంటున్నారు. గంటాకు ఈసారి చివరి విడతలో టికెట్ దక్కింది. దాంతో పార్టీతో ఆయనకు గ్యాప్ ఉందని ప్రచారం సాగింది. విపక్షంలో ఉన్నపుడు అయిదేళ్ల పాటు పెద్దగా ఆయన యాక్టివ్ గా లేరు అన్నది ఒక విమర్శ ఉంది.

దాంతో ఈసారి గంటా తొందరపడి ఇలా ముందే బాబు సీఎం అంటూ ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. బాబు సీఎం అయితే మరోమారు బెర్త్ తనకు ఖాయం అవుతుందన్నది గంటా ధీమా అని ఆ వ్యూహంతోనే ఇలా బాబు మెచ్చుకోలు కోసం ప్రమాణ స్వీకారం డేట్ కూడా వదిలారు అని అంటున్నారు. వీటిని చూసిన వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈసారి గెలిచేది వైసీపీయే అన్నది టీడీపీ తమ్ముళ్లకూ తెలుసు అని వారు అంటున్నారు.