నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గం టీడీపీలో విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల చంద్రబాబు సభ నేపథ్యంలో ఆళ్లగడ్డ టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆళ్లగడ్డలో చంద్రబాబు సభకు సొంత పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, జనసేన నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి రాకూడదని మాజీ మంత్రి అఖిలప్రియ షరతు విధించారు. తనకు ఆహ్వానం లేకపోవడంతో సభకు వెళ్లలేదని రాంపుల్లారెడ్డి అన్నారు.
ఏవీ సుబ్బారెడ్డి మాత్రం టీడీపీ నేతల సూచనల మేరకు బాబు సభకు వెళ్లలేదు. చంద్రబాబు సమక్షంలో అఖిలప్రియ ప్రసంగిస్తూ టీడీపీలో కోవర్టులున్నారని ఆరోపించారు. వాళ్లందరి అంతు చూస్తామని ఆమె హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అఖిలప్రియ ఆరోపించిన కోవర్టు తానే అని ఆయన అన్నారు. తనను అన్యాయంగా జైలుకు పంపారని అఖిలప్రియ ఆరోపించడాన్ని ఆయన కొట్టి పారేశారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే అని ఆయన అన్నారు. ఆళ్లగడ్డ సీటు తనకే అని చంద్రబాబు చెవిలో చెప్పాడని అఖిలప్రియ ప్రచారం చేసుకోవడాన్ని ఏవీ సుబ్బారెడ్డి తప్పు పట్టారు. అఖిలప్రియ వైఖరి విడ్డూరంగా ఉందని ఆయన దెప్పి పొడిచారు. నంద్యాల అభ్యర్థిగా ఫరూక్‌ను అచ్చెన్నాయుడు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అఖిలప్రియకు టికెట్, వస్తుందో రాదో తాను చెప్పలేనన్నారు.
ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఆళ్లగడ్డ తాను భారీ మెజార్టీతో గెలుపొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డకు తాను వెళ్లాలని అనుకుంటే ఎవరూ అడ్డుకోలేరని హెచ్చరించారు.
ఆళ్లగడ్డ సభకు రావద్దని టీడీపీ పెద్దల సూచన మేరకే వెళ్లలేదన్నారు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, అలాగే పరిశీలకుడు తన ఇంటికి వచ్చి …యువగళంలో చేదు అనుభవాలను గుర్తు చేస్తూ చంద్రబాబు సభకు రాకపోతే బాగుంటుందనే విజ్ఞప్తి చేశారన్నారు. టీడీపీ పెద్దలపై గౌరవంతో గొడవలకు ఆస్కారం ఇవ్వకూడదనే చంద్రబాబు సభకు వెళ్లలేదన్నారు. అంతే తప్ప, భయపడి మాత్రం కాదని ఆయన అన్నారు.
ఆళ్లగడ్డలో పుట్టి పెరగానని, అక్కడే ఆస్తులున్నాయని, తనను వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. అఖిలప్రియ ఊకదంపుడు బెదరనని అందరికీ తెలుసన్నారు. భూమా అఖిలప్రియ అల్టిమేటానికి, బెదిరింపులకు భయపడనని ఏవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. అఖిలప్రియకు తప్ప, భూమా కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు.