ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఇదిగో అదిగో అంటున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారులు కూడా ఏపీలో పర్యటించి, ఇక్కడి నాయకుల నుంచి ఫిర్యాదులు, సూచనలు, సలహాలు సేకరించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు రాజకీయ పార్టీలు కొన్ని స్వతంత్ర సంస్థలతో సర్వేలు చేయిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నాయి. ఈ క్రమంలో సర్వేల్లో టీడీపీకి వచ్చే సీట్లపై ఆ పార్టీ నుంచి ఇటీవలే బయటికొచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వెల్లడించి సంచలనం సృష్టించారు. ఇవాళ ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
టీడీపీకి 54 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని ఆయన అన్నారు. విజయవాడ ద్రోహి చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. పొరపాటున కూడా చంద్రబాబు అధికారంలోకి రారని ఆయన జోస్యం చెప్పారు. ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన జగన్‌కు నాని కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ అవమానకర రీతిలో తనను మెడపట్టి బయటికి గెంటేసిందని కేశినాని వాపోయారు. కానీ తనను అక్కున చేర్చుకుని జగన్ ఎంపీ సీటు ఇచ్చారని ప్రశంసించారు. లోకేశ్‌ను సీఎం చేయడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.
కాజా నుంచి కట్టి వుంటే బ్రహ్మాండమైన నగరం అయ్యి వుండేదన్నారు. అమరావతి రాజధాని 30 ఏళ్లు అయినా పూర్తి కాదని అప్పుడే చెప్పానని ఆయన గుర్తు చేశారు. భూమాఫియా చేతల్లోకి వెళ్లి తండ్రీకొడుకులు రైతుల్ని నిలువునా మోసగించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా వుండగా విజయవాడ లోక్‌సభ సభ్యుడిగా ముచ్చటగా మూడోసారి గెలుపొంది జగన్‌కు అంకితం ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. అలాగే తన పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యతను తీసుకుంటానన్నారు.