ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు పక్క పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. కడప నగరంలో కీలక పదవిలో ఉన్న ఆ నాయకుడు కొంత కాలంగా వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారు. ఆఫ్ ది రికార్డు అంటూ సొంత పార్టీ తీరుపై విమర్శలు చేస్తున్నారని సమాచారం. దీంతో వైసీపీని వీడుతారనే చర్చకు తెరలేచింది.
మొదటి నుంచి అతను వైఎస్సార్ కుటుంబం నుంచి నడుస్తున్నారాయన. గతంలో జెడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. వైఎస్సార్ కుటుంబానికి నమ్మకస్తుడైన బీసీ నాయకుడు కావడంతో పార్టీ లేదా అధికార పదవులను కట్టబెడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా కీలక పదవిలో ఉంటున్నప్పటికీ, ఎమ్మెల్సీ ఇవ్వలేదని అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల వేళ తన అసంతృప్తిని ఆయన నెమ్మదిగా బయట పెడుతున్నారు. నమ్మకస్తుడైన తనను కాదని, బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఇప్పుడు ఏమైందో చూడాలని సీ.రామచంద్రయ్య రాజీనామాను ఉదహరిస్తున్నారు. ఇటీవల టీడీపీలో రామచంద్రయ్య చేరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ పదవిని తనకు ఇచ్చి వుంటే జగన్ నమ్మకాన్ని నిలిపి వుండేవాడనని అందరితో అంటున్నారు.
ఆ మధ్య అనారోగ్యంతో సదరు జగన్ సన్నిహితుడు ఆస్పత్రి పాలయ్యారు. ఆ తర్వాత కోలుకున్నారు. అనారోగ్యాన్ని సాకుగా చెబుతూ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారని వినికిడి. ప్రస్తుతం కడప నగర పాలక సంస్థలో కీలక పదవిలో ఉన్న ఆయన గారు టీడీపీలో చేరుతారని సొంత పార్టీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఏమవుతుందో చూడాలి.