మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేసే అవకాశం వుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం న్యాయపోరాటం చేయడంలో తగ్గేదే లే అని ఆయన అంటున్నారు. తాజాగా బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే నిర్ణయం చర్చనీయాంశమైంది.
హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అవినాష్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా? తీర్పు ఏమిస్తుందోనన్న చర్చకు తెరలేచింది.
నిజానికి మంగళవారం విచారణకు రావాలని సీబీఐ కేవలం ఒక రోజు ముందు అవినాష్‌కు నోటీసులు ఇచ్చింది. అయితే షెడ్యూల్ ప్రకారం తన నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వుందని, నాలుగు రోజుల తర్వాత వస్తానని సీబీఐకి ఆయన సమాచారం ఇచ్చారు. దీంతో ఈ నెల 19న విచారణకు రావాలని సీబీఐ కోరింది.
ఇప్పటికే పలుమార్లు అవినాష్‌ను సీబీఐ విచారించింది. ప్రస్తుతానికి అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ ఇంత వరకూ అవినాష్‌రెడ్డి విషయంలో సీబీఐ సంయమనంతోనే వ్యవహరిస్తోందని అత్యున్నత న్యాయస్థానం సైతం వ్యాఖ్యానించింది.
ఇదిలా వుండగా సుప్రీంకోర్టును అవినాష్ బెయిల్ కోసం ఆశ్రయిస్తున్న నేపథ్యంలో, వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్ వేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రతి విషయంలోనూ సునీత తన వాదన వినాలంటూ ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.