నర్శీపట్నంలో అన్నదమ్ముల సవాల్!

ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నంలో అన్న దమ్ముల సవాల్ కి తెర లేచింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం లో కీలక నేత. ఆయన తమ్ముడు నర్శీపట్నం మున్సిపాలిటీ మాజీ వైఎస్ చైర్మన్…

ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నంలో అన్న దమ్ముల సవాల్ కి తెర లేచింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం లో కీలక నేత. ఆయన తమ్ముడు నర్శీపట్నం మున్సిపాలిటీ మాజీ వైఎస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు వైసీపీలో ముఖ్య నేత. అన్న అయ్యన్న ఓటమిని తమ్ముడు కోరుకుంటున్నారు.

అయిదేళ్ల క్రితం నుంచి అన్నదమ్ముల మధ్య రాజకీయ సమరం సాగుతోంది. ఇదిలా ఉంటే అయ్యన్నపాత్రుడు కుటుంబానికి ఇలవేలుపుగా మరిడి మహలక్ష్మి అమ్మ వారు ఉన్నారు. అమ్మవారి ఉత్సవాలు సరిగ్గా ఎన్నికల సీజన్ లో వచ్చాయి. దాంతో రాజకీయంతో పాటు అన్ని అంశాలు అన్న దమ్ముల మధ్య తాజాగా కొత్త చిచ్చు పెట్టాయి. ఈ నెల 15 నుంచి 23 వరకూ అమ్మవారి ఉత్సవాలకు రంగం సిద్ధం అయింది.

ఈ నేపధ్యంలో అమ్మవారి నగలు తమ్ముడి ఇంట్లో ఉన్నాయని వాటిని ఈసారి అమ్మవారికి అలంకరించకపోతే తాను తమ్ముడి మీదనే పోలీసు కేసు పెడతాను అని మాజీ మంత్రి అయ్యన్న హెచ్చరించారు. దానికి ధీటుగా తమ్ముడు సన్యాసిపాత్రుడు బదులిచ్చారు. ఆ నగలను తాను భద్రంగానే ఉంచానని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మ వారికి అలంకరిస్తామని చెప్పారు.

అయ్యన్నపాత్రుడు అమ్మవారి పేరుతో వసూల్ చేసిన ఆరు లక్షల రూపాయల నగదు విషయంలో కూడా బాధ్యత వహించకపోతే తాను సైతం పోలీసు కేసు పెడతాను అని తమ్ముడు సన్యాసిపాత్రుడు హెచ్చరించారు. దీంతో అమ్మ వారి సాక్షిగా అన్న దమ్ముల యుద్ధానికి తెర లేచింది. అయ్యన్న సుదీర్ఘ రాజకీయ జీవితంలో పదో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

ఈసారి గెలిచి రాజకీయాల నుంచి రిటైర్ కావాలని అయ్యన్న చూస్తున్నారు. అయ్యన్నను ఓడించి వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ ని గెలిపించాలని తమ్ముడు పట్టుదల మీద ఉన్నారు. దీంతో అమ్మ వారు సాక్షిగా అన్నదమ్ములు కత్తులు దూస్తున్న నేపధ్యం ఉంది. దీంతో ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం అయితే నర్శీపట్నంలో నెలకొంది.