తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు మంతనాలు ఏమాత్రం ఫలితం ఇవ్వడం లేదు. స్థానికంగా ఉన్న కమ్మ నాయకులను బుజ్జగించి, పార్టీకి అనుకూలంగా పని చేయించడంలో చంద్రబాబునాయుడు విఫలం అయినట్టే కనిపిస్తోంది.
చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే పార్టీలో ఉన్న ముఠాలను బుజ్జగించి.. సమైక్యంగా పనిచేయించడంలో విఫలం అవుతున్నారు. కూటమి పార్టీల ఓట్లు బదిలీ సంగతి తర్వాత.. అసలు తెలుగుదేశంలోనే కమ్మ ఓటు పూర్తిగా సుధీర్ కు వ్యతిరేకం అవుతోంది. ఈ నేపథ్యంలో బొజ్జల వారసుడు గండం గడిచి బయటపడడం కష్టమే అంటున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన ఎస్సీవీ నాయుడు కొంతకాలం కిందట వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశంలోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయన టికెట్ కోసం గట్టి ప్రయత్నమే చేశారు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం.. బొజ్జల సుధీర్ రెడ్డికే టికెట్ కట్టబెట్టారు. అప్పటినుంచి అసంతృప్తిగానే ఉన్న ఎస్సీవీ నాయుడు.. ఇప్పటిదాకా పార్టీ ప్రచారపర్వంలోకి అడుగుపెట్టలేదు.
చంద్రబాబునాయుడు ప్రజాగళం సభ నిర్వహించినప్పుడు, రాత్రి శ్రీకాళహస్తిలోనే బస చేసి ఎస్సీవీకి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పార్టీని గెలిపించాలని, ఆయన గురించి తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అయినా సరే.. ఎస్సీవీ బెట్టు వీడలేదు. తెదేపా అభ్యర్థి బొజ్జల సుధీర్ పలుమార్లు ఎస్సీవీ ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఆయన తల్లి బృందమ్మ కూడా రెండు సార్లు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదిగో ప్రచారానికి వస్తున్నా అంటున్నారే తప్ప కార్యరంగంలోకి రాలేదు. ఆయనతో పాటు.. నియోజకవర్గంలోని కమ్మ బ్యాచ్ మొత్తం గుంభనంగా ఉంది. సుధీర్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అనిపించేలా చేస్తున్నారు.
తెదేపాకు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు లేట్ గురవయ్య నాయుడు కొడుకు రాజేష్ నాయుడు కూడా తెదేపా అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు. దక్కకపోయే సరికి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. ఆయనకు టికెట్ ఇప్పించింది ఎస్సీవీనాయుడే అనే ప్రచారం కూడా ఉంది. ఆ రకంగా తెలుగుదేశంలోని కమ్మ ఓట్లు రాజేష్ నాయుడుకు పడే అవకాశం ఉంది.
ఇన్ని సమీకరణాల మధ్య.. సుధీర్ రెడ్డి గెలవడం అసలు సాధ్యమవుతుందా అనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. గత ఎన్నికల కంటె ఎక్కువ తేడాతోనే ఓడిపోవచ్చునని కూడా పలువురు అనుకుంటున్నారు.