కులాల పరంగా సమాజాన్ని చీలుస్తున్న బాబు!

బీసీలు, నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం పని చేసిన జ్యోతిబాఫూలే జయంతి నేడు. ఈ సందర్భంగా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను స్మరించుకోవడం, బీసీలను కొనియాడడం వంటివి చాలా మామూలు సంగతి. అయితే చంద్రబాబునాయుడు…

బీసీలు, నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం పని చేసిన జ్యోతిబాఫూలే జయంతి నేడు. ఈ సందర్భంగా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను స్మరించుకోవడం, బీసీలను కొనియాడడం వంటివి చాలా మామూలు సంగతి. అయితే చంద్రబాబునాయుడు ఒక అడుగు ముందుకు వేసి.. బీసీలకు ఒక వరాన్ని కూడా ప్రకటించారు.

తెలుగుదేశం అధికారంలోకి వస్తే బీసీలకు యాభయ్యేళ్లకే వృద్ధాప్య పింఛను రూ.నాలుగు వేలు ఇస్తానంటూ ఆర్భాటపు ప్రకటన చేశారు. కుట్రలకు కుత్సితాలకు పెట్టింది పేరు అయిన చంద్రబాబునాయుడు.. సమాజాన్ని కులాల పరంగా చీల్చడానికే ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించారనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పింఛను వస్తుంది. చంద్రబాబునాయుడు హయాంలో వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్న పింఛనును, జగన్ రెండు వేలు చేస్తానని హామీ ఇవ్వడంతో జడుసుకున్న అప్పటి సీఎం చంద్రబాబు.. ఎన్నికలకు ముందు రెండువేలు చేశారు. కానీ.. జగన్ తాను సీఎం అయిన తర్వాత మూడువేలుగా పెంచి ఇళ్ల వద్దకే అందిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఆ పింఛనును నాలుగువేలకు పెంచి ఇస్తానంటూ ఒక ప్రహసనం నడిపిస్తున్నారు.

ప్రస్తుతం అరవయ్యేళ్లు దాటిన అన్ని కులాల వారికీ పెన్షను వస్తుంది. వారితో పాటు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు యాభయ్యేళ్లు దాటితేనే పింఛను వస్తుంది. చర్మకారులకు నలభై దాటితేనే పింఛను వస్తుంది. అయితే చంద్రబాబు ఇప్పుడు కొత్తగా.. బీసీలు అందరికీ యాభై దాటితే ఇస్తానని అంటున్నారు.

తక్కువ వయసుకే పింఛను అనేది ఇదివరలో కొన్ని వృత్తులు, కులాల వారికి ఉన్నప్పటికీ.. ఆయా వృత్తుల్లో ఉన్న సంక్లిష్టతలు, దీర్ఘకాలం కొనసాగలేని పరిస్థితుల కారణంగా అలా ఏర్పాటుచేశారు. అందులో సామాజిక వృత్తిపరమైన ఇబ్బందులను సూచించే కారణాలున్నాయి. కానీ చంద్రబాబు ఇప్పుడు కేవలం కులమే ప్రాతిపదికగా యాభయ్యేళ్లకు పింఛను ఇస్తానని అంటున్నారు.

ఇది సమాజంలో ఉండే సమతుల్యతను దెబ్బతీస్తుంది. కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుంది. సమాజంలో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. కులాల మధ్య చిచ్చు రగల్చి అందులో చలి కాచుకోవాలనుకునే ధోరణి చంద్రబాబుది అని పలువురు విమర్శిస్తున్నారు.