ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో సీఎం వైఎస్ జగన్‌కు బుద్ధి రాలేదని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర పర్యటనలో వున్నారు. దీంతో ఆయన ఉత్తరాంధ్ర, విశాఖపై ప్రత్యేకమైన ప్రేమ మాటల్ని కుమ్మరించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి కర్రుకాల్చి వాతపెట్టారని ఆయన అన్నారు. జగన్ వై నాట్ 175 అంటున్నారని, తాము వై నాట్ పులివెందుల అంటున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తామని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్కు భయం పట్టుకుందన్నారు. జగన్ను పులివెందులలో ఓడిస్తామని చంద్రబాబు సవాల్ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో గుంటూరు, విజయవాడలలో తమను ఓడించిన తర్వాత చంద్రబాబు ఏమైనా బుద్ధి తెచ్చుకున్నారా? అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు, విజయవాడలలో నిర్వహించిన ప్రచారంలో … వైసీపీని గెలిపిస్తే మూడు రాజధానులకు మద్దతు ప్రకటించినట్టు అవుతుందని హెచ్చరించారు.
అయినప్పటికీ ఆ రెండు చోట్ల వైసీపీకే పట్టం కట్టారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం సాగుతున్నప్పుడు ఎన్నికలు జరిగాయి. మరి అప్పటి ఫలితాలతో రాజధానిపై చంద్రబాబుకు జ్ఞానోదయం ఎందుకు కాలేదని ప్రశ్న ఉత్పన్నమైంది. అలాగే కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మట్టి కొట్టుకుపోవడం, రెండు నెలలకు ఒకసారి చంద్రబాబు అక్కడికి పరుగులు తీస్తున్న వైనాన్ని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు.
తన సీటును కాపాడుకునేందుకు ఎన్నెన్నో ప్రయాసలు పడుతున్న చంద్రబాబు పులివెందుల్లో గెలుస్తామనడం విడ్డూరంగా వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాతీర్పు ఏదైనా గౌరవించడం చంద్రబాబు రాజకీయ జీవితంలో లేనే లేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్రలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని వెటకరిస్తున్నారు.