ఎల్లో మీడియాధిపతి రామోజీరావు అంటే మూడు నెలల క్రితం వరకూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒంటికాలిపై లేచేవారు. ఈనాడు పత్రికలో తనను టార్గెట్ చేసి వార్తలు రాయడంపై …. సదరు పత్రికతో పాటు యజమాని రామోజీరావుపై ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసేవారు. తాజాగా మార్గదర్శి విషయంలో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఏకంగా రామోజీరావు, ఆయన కోడలు శైలజాకిరణ్‌లను ఏ1, ఏ2లుగా నిర్ధారించింది.
ఇటీవల రామోజీని విచారించడానికి ఏపీ సీఐడీ హైదరాబాద్ వెళ్లింది. విచారణ సందర్భంలో రామోజీ అనారోగ్యంతో పేరుతో మంచమెక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. రామోజీపై ఓ రేంజ్‌లో సెటైర్స్ పేలాయి. ఇంతకాలం మీడియాను అడ్డు పెట్టుకుని అందరిపై ఇష్టానుసారం వార్తలు రాసిన రామోజీకి పాపం పండే రోజు వచ్చిందనే అభిప్రాయాలు వెల్లువెత్తాయి.
అయితే రామోజీకి ఇంత జరుగుతున్నా, ఆయన శత్రువు విజయసాయిరెడ్డి మాత్రం అసలు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విజయసాయిరెడ్డిలో ఇంత సహనం ఏంటబ్బా అనే చర్చ జరుగుతోంది. ఇదే మార్గదర్శిలో సోదాలు నిర్వహించడంపై స్టే వచ్చిన సందర్భంలో, సంబంధిత ఈనాడు కథనాన్ని గత ఏడాది డిసెంబర్ 18న విజయసాయిరెడ్డి ట్విటర్‌లో షేర్ చేశారు. అలాగే దానిపై తన మార్క్ ఘాటు కామెంట్స్ చేశారు. ఆ రోజు ఆయన ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.
“రామోజీ!…సమాచారం అడిగితే స్టే. సోదాలు నిర్వహిస్తే కోర్టుకెళ్తావు. మళ్లీ పారదర్శకత, ప్రజాస్వామ్యం అంటూ నీతులు చెప్తావు. ఏ తప్పూ చేయకపోతే ధైర్యంగా విచారణను ఎదుర్కో. అప్పుడు తేలుతాయి నీ బాగోతాలు!!”
గత ఏడాది డిసెంబర్ 18వ తేదీనే రామోజీపై మరో ట్వీట్ కూడా విజయసాయిరెడ్డి చేసి వుండడాన్ని గమనించొచ్చు. “రామోజీ వయసు ఉడిగి గట్టిగా నాలుగడుగులు వేయలేని పరిస్థితి. పాప పరిహారానికి సమయం ఆసన్నమైంది. పేపరుకు పెట్టుబడిపెట్టి నిన్నీ స్థాయికి తెచ్చిన GJ Reddy రుణం తీర్చుకో. వారసులెవరో వెతికి వాళ్లది వాళ్లకిచ్చేయ్. లేరనిపిస్తే ప్రభుత్వ ఖజానాకి జమచేయ్”
ఇలా రామోజీపై అక్కసు వెళ్లగక్కిన విజయసాయిరెడ్డి… ఇప్పుడు పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించడం విశేషమే. గత ఏడాది డిసెంబర్ వరకూ రామోజీరావును బద్ధ శత్రువుగా భావించిన విజయసాయిరెడ్డి, ఆ తర్వాత ఏ ఒక్కరిపై కూడా విమర్శలు చేయని సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 19న విజయసాయిరెడ్డి ట్వీట్ చూస్తే… రామోజీపై ఆయన ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు.
“చెప్పేవి శ్రీరంగ నీతులు…చేసేవి చీటింగ్ పనులు. చెప్పేది ధర్మం – న్యాయం…చేసేది మోసం. పొద్దున్న లేవగానే ఈ భూగ్రహం ఎలా తిరగాలో చెప్తాడు. అతనిది మాత్రం వంకర మార్గం…అతనే మన రామోజీ!” అని ట్వీట్ చేశారు. శ్రీరంగనీతులు చెప్పే రామోజీని అనారోగ్యం పాలు చేసి, మంచం ఎక్కించిన ఘనత విజయసాయిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార పార్టీకే దక్కుతుంది. మరెందుకని ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నది ప్రశ్న. రాజకీయంగా విజయసాయిరెడ్డి సన్యాసం తీసుకున్న వారి మాదిరిగా వ్యవహరిస్తుండడం లాభమో, నష్టమో ఆలోచించాల్సిన అవసరం వుంది.