మాయాబజార్ సినిమాలో దుశ్శాసనుడు క్యారెక్టర్ ఉంది. దుర్యోధనుడు, శకుని ఏం చెప్పినా “అదే మన తక్షణ కర్తవ్యం” అంటూ మొరగడం తప్ప పెద్దగా ఏమీ చెయ్యడు. ఇప్పుడు నాగబాబు కూడా అంతే. అన్నయ్య మోచేతి కింద నీళ్లు తాగడం, ట్విట్టర్లో మొరగడం తప్ప పెద్దగా పీకేదేమీ ఉండదు. “ట్విట్టర్లో మొరగడం” ఏంటి “కూయడం” కదా అనుకోవద్దు. ట్విట్టర్ కి పిట్ట బొమ్మ పీసేసి కుక్క బొమ్మ పెట్టాడు ఎలాన్ మస్క్…ఇలాంటి మొరుగుళ్లు చూసి.
అసలు నాగబాబుకి తెలివితక్కువ, బిల్డప్పెక్కువ. ఆ మాధ్యన గెడ్డం పెంచి రవీంద్రనాథ్ టాగోర్ రేంజిలో శాలువా కప్పుకుని కనిపించాడు. హైపర్ ఆది లాంటి వాళ్లు అతన్ని వేదిక మీద మేథావి, చదువరి, విజ్ఞాని అని పొగడడం, నాగబాబు మేథావి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎంజాయ్ చేయడం అంతా ఒక సినీ స్టంటులా సాగింది.
ఇప్పుడింతకీ మేటర్లోకొస్తే..రామోజీరావుని వెనకేసుకొస్తూ సుదీర్ఘమైన ట్వీట్ పెట్టాడు నాగబాబు. ఆ ట్వీట్ చదువుతుంటే “నాగబాబు మరీ ఇంత బానిసా! కొంచెం కూడా ఆత్మాభిమానం లేదా” అనిపిస్తుంది.
ఇంతకీ ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం:
“తెలుగు సినీ, మీడియా రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకు వచ్చి, వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ, కళారంగంలో “గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్”లో చోటు దక్కించుకొని ప్రపంచస్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన “పద్మ విభూషణ్” శ్రీ రామోజీ రావ్ గారు లక్షలాది మందికి ఆదర్శం. ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురు కాని అవినీతి ఆరోపణలు వై.సీ.పీ. అధికారంలోకి వచ్చాక పుట్టుకు రావడం విచారకరం. ఏడు పదుల వయసుపైబడిన శ్రీ రామోజీ రావ్ గారిని, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయం. శ్రీ రామోజీ రావ్ గారిపై సామాజిక మాధ్యమాల్లో కావాలని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం”.
ఇలా ట్వీటితే తన తమ్ముడు పవన్ కి మీడియా మొగలయ్య బాగా కవరేజిచ్చి నిలబెడతాడనుకుంటున్నాడేమో. అవతల అతనే బెడ్ మీద పొడుకుని బిక్కుబిక్కుమంటున్నాడు. అసలు రేపు తెదేపా “మాకు జనసేన అవసరం లేదు. సోలో గా బరిలోకి దిగుతున్నాం” అని చెప్తే చాలు…ఈ నాగబాబు ట్వీట్ ని కూడా పరిగణించకుండా పవన్ ని నేలమట్టం చేసే పచ్చరాతలు రాసేస్తుంది ఆ పత్రిక. ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా వేలికి ఏదొస్తే అది ట్వీటేయడం నాగబాబుకే చెల్లింది.
“…”గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్”లో చోటు దక్కించుకొని ప్రపంచస్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన “పద్మ విభూషణ్” శ్రీ రామోజీ రావ్ గారు లక్షలాది మందికి ఆదర్శం..” అన్నాడు. దేంట్లోనో ఆదర్శమైతే అతడు నేరం చేస్తే నోరెత్తకూడదని, పోలీసులు, కోర్టులు పిలవకూడదని ఉందా?
గినీస్ బుక్కైతే ఏంటి? వందలాది భాషల్లో పాటలు పాడి, దేవాలయ పరిరక్షణ మీద, మానవ సంబంధాల మీద, బడి మీద, గాంధీ మీద..ఇలా సమాజంలోని ప్రతి అంశం మీద పాటలు పాడి గిన్నీస్ బుక్కులోకెక్కిన గజల్ శ్రీనివాస్ ఒక కేసులో ఇరుక్కుంటే కోర్టు మెట్లెక్కక, జైలు గుమ్మం తొక్కక తప్పిందా? సమాజం దృష్టిలో ఆదర్శం ఆదర్శమే..చట్టం దృష్టిలో నేరం నేరమే.
“తెలుగు సినీ, మీడియా రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకు వచ్చి, వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ…” అంటాడు. రామోజీరావుకే ఇంత పిసికేసుకుంటే సత్యం రామలింగరాజు విషయంలో ఇంకెంత పిసుక్కోవాలి. రామలింగరాజు కల్పించిన జీవనాధారం ఎంతమందికి? అదీ ఏ స్థాయిలో? విదేశాలకి సైతం పాకిన సామ్రాజ్యం ఆయనది. కానీ ఒకానొక తప్పు జరిగింది. కోర్టులు, జైళ్లు రమ్మన్నాయి. వెళ్లాడు. అంతే కానీ ఒంట్లోబాలేదని బెడ్డెక్కి దుప్పటి కప్పుకోలేదు.
“…ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురు కాని అవినీతి ఆరోపణలు వై.సీ.పీ. అధికారంలోకి వచ్చాక పుట్టుకు రావడం విచారకరం..”
అసలు సోయి ఉండే ఈ వాక్యం రాసాడా? చరిత్ర మరిచిపోయాడా? వై.ఎస్.ఆర్ హయాములోనే ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి కేసుని బైటకు లాగాడు. అప్పట్నుంచీ ఇప్పటి వరకు ఆ కేసు కొనసాగుతూనే ఉంది. అదేదో వైసీపీ ప్రభుత్వం రాకముందు మీడియా మొగలయ్య స్వాతిముత్యమన్నట్టు మాట్లాడడం ఏమన్నా బాగుందా నాగబాబూ!
“…ఏడు పదుల వయసుపైబడిన శ్రీ రామోజీ రావ్ గారిని, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయం”..
రామోజీరావు వయసెంతో కూడా తెలీదా నాగూ నీకు! 86. ఇంకా ఏడు పదులేంటి? అంటే నీ బుర్ర పదేళ్ల క్రితమే ఆగిపోయిందనుకోవాలా?
ఏంటి? ఆయన్ని, ఆయన కుటుంబాన్ని విచారించడం శోచనీయమా? మరి జగన్ మోహన్ రెడ్డిపై విషం చిమ్మడం, ఆర్ధిక నేరస్థుడని ముద్ర వేయడం, రెండు పార్టీలు కలిసి వేధించడం శోచనీయం కాదా? జగన్ మోహన్ రెడ్డి అవన్నీ ధైర్యంగా ఎదుర్కొన్నాడుగా?
పైన చెప్పుకున్న వాళ్లల్లో బ్రాహ్మణ, రాజు, రెడ్డి సమాజిక వర్గాల వాళ్లు ముగ్గురూ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కేసుల్ని ఎదుర్కున్నారు, చట్టాన్ని గౌరవిస్తూ తలవంచారు. మరి రామోజీరావేమన్నా అవతారపురుషుల కులంలో పుట్టాడా? ఇక్కడ కులప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వస్తోందంటే, అసలే ఆయన ఒకానొక కులానికి కులగురువుగా బ్రాండయ్యాడు. ఆయన కూడా నలుగురితో పాటూ చట్టానికి లోబడి ప్రవర్తిస్తే ఆ కులంపై సమాజంలో ఉన్న కినుక, వ్యతిరేక భావం సద్దుమణుగుతాయి. లేకపోతే ఒక్కడి కారణంగా “వీళ్లింతే…సమాజమంతా ఒకటి..వీళ్ళొక్కళ్లకీ ప్రత్యేక ప్రతిపత్తులుంటాయి” అనే భావన బలపడుతుంది. దానివల్ల ఆ సామాజికవర్గం సమాజంలోని ఇతర సామాజికవర్గాల వారి మనసుల నుంచి మరింత దూరమౌతుంది. కనుక ఈ విషయంలో పెద్దాయన ఆలోచించుకోవాలి.
ఆయన విషయం పక్కన పెట్టి నాగబాబు విషయానికి వెనక్కొస్తే, అలాంటి డబ్బా ట్వీట్ పెట్టే బదులు, రామోజీరావుపై ఉండవల్లి చేస్తున్న ఆరోపణలకి హేతుబద్ధంగా స్పందించవచ్చు కదా. ఆయన ప్రశ్నలకి రామోజీ వైపు వకాల్తా పుచ్చుకుని సమాధానాలు చెప్పొచ్చుకదా. అబ్బే అది చేతకాదు. ఎందుకంటే ఆ చేవ లేదు. పొట్ట కోస్తే బూతులు, వెటకారాలు, వెక్కిలి నవ్వులు తప్ప ఇంకేవీ కనపడవు. ఉండవల్లిని ఎదుర్కునే దమ్మెక్కడినుంచి వస్తుంది?
నాగబాబూ! నీ తలతిక్క ట్వీట్లతో పవన్ అభిమానులకి కూడా చిరాకు పెడుతున్నావు. మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతిలో ఆర్కే పవన్ గారిపై రాసిన రూ 1000 కోట్ల ప్యాకేజీ వార్త ఇంకా జనసైనికుల మనసుల్లోంచి పోలేదు. ఏబీయన్ ని, ఈనాడు ని ఒక గూటి పక్షులుగానే చూస్తుంది కాపు సమాజం. కనుక రామోజీని వెనకేసుకొస్తూ పెట్టిన ట్వీట్ ఎక్కడో కాలేలాగ ఉంది చాలామందికి. విషయంలేని వాడు సైలెంటుగా ఉండడం మంచింది. ఆ విషయాన్ని గుర్తెరిగి మసలుకోవాలని జనసైనిక, కాపు, పవన్ అభిమాన సమాజం కోరుకుంటోంది.
వై. నాగపాల్ శ్రీనివాస్