పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తాజాగా తీర్పు వెలువడింది. ఈ మేరకు హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్‌ని ఏ1గా, అలాగే ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్‌తో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత అర్ధరాత్రి బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడంతో తెలంగాణలో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇదే అవకాశంగా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీపై వ్యతిరేకత పెంచేందుకు వ్యూహాత్మకంగా వాడుకుంటున్నారు.
విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన వ్యవహారం కావడంతో బీజేపీపై సహజంగానే తెలంగాణ సమాజంలో వ్యతిరేకత కనపడు తోంది. పక్కా వ్యూహంతో బండి సంజయ్‌ని అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పేపర్స్‌ను లీక్ చేశారని మొదట ఆరోపణలు ఎదుర్కొన్న ప్రశాంత్ సెల్‌ఫోన్ నుంచి అనేక దఫాలు బండి సంజయ్‌కి కాల్స్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. చివరికి బండి సంజయ్ ఆదేశాల మేరకు ప్రభుత్వాన్ని బద్నాం చేసే క్రమంలో పేపర్ లీక్స్‌కు తెరలేపారని పోలీస్ అధికారులు తేల్చారు. దీంతో బండి సంజయ్‌ని అరెస్ట్ చేసి హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో బండి సంజయ్‌ని ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా హన్మకొండ కోర్టు దగ్గర బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు మోహరించాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. దీంతో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.