‘సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు’ అన్నట్టుగా ముగిసింది పవన్ కల్యాణ్ ఢిల్లీ యాత్ర. ఆయన రెండు రోజుల ఢిల్లీయాత్ర చేసి వచ్చారు. జెపి నడ్డా తప్ప నిర్ణయాత్మకమైన నాయకులను ఎవ్వరినీ కలవకపోయినప్పటికీ.. ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్ పరిణామాలను ఎలా తానే డిసైడ్ చేయబోతున్నాడో చాలా డాంబికంగా సెలవిచ్చారు.
నిందలు తప్ప నిర్మాణాత్మక విమర్శగానీ, ఉపయోగపడే సలహా గానీ లేని ఒక లేఖను పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఇచ్చారు. నిధులివ్వకుండా వంచిస్తున్న పాపం మొత్తం కేంద్రానిది కాగా, వారిని పల్లెత్తు మాట అనలేని చేతగానితనంతో.. వక్రబుద్ధితో జగన్ కు రకరకాలుగా ముడిపెట్టి ఆయన మీద నిందలు వేశారు. అన్నీ అయిపోయినట్టు ఇప్పుడు పోలవరం పోరాటం ఎత్తుకున్నారు. నెలరోజుల్లోగా ఆ ప్రాజెక్టును విజిట్ కూడా చేస్తారట.
ఆ సంగతి మొత్తం పక్కన పెడితే.. ఆయన ఢిల్లీ వెళ్లిన అసలు పని సానుకూలం కాలేదు. చంద్రబాబు పల్లకీబోయీల జట్టులోకి రావడానికి బిజెపి పెద్దలు అంగీకరించలేదు. పవన్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. జగన్ ను ఓడించాల్సిందే అని పవన్ అంటే.. మా కోరిక కూడా అదే, అందుకని మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి చంద్రబాబు పంచన చేరే చాన్స్ లేనే లేదని తెగేసి చెప్పారు.
నిజం చెప్పాలంటే పవన్ కల్యాణ్ తన గురించి తాను చాలా ఎక్కువ ఊహించుకున్నారు. ప్రతి సభలోనూ మోడీ తనకు మంచి మిత్రుడు అని చెప్పుకోవడం అలవాటుగా అదే భ్రమల్లో ఉండే పవన్ కల్యాణ్ తన మాటను తోసిపుచ్చేంత సాహసం బిజెపికి లేదని అనుకున్నారు.
ఎగేసుకుని ఢిల్లీ వెళ్లి పొత్తుల గురించి అడిగితే.. వారు తిరస్కరించడంతో ఖంగుతిన్నారు. అసహనానికి గురయ్యారు. ఈ ఫ్రస్ట్రేషన్ లో పవన్ కల్యాణ్ కాస్త అతిగా స్పందించే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉన్నదని పలువురి అంచనా.
బిజెపి తనను ఛీకొట్టిందనే ఫ్రస్ట్రేషన్ పవన్ కల్యాణ్ ను నిలువునా దహించివేస్తున్నది. కమలం పార్టీ పెద్దల వద్ద.. వారి భాగస్వామి పార్టీ అయిన తనమాట కంటె జగన్ మాటకే ఎక్కువ విలువ ఉన్నదనే సంగతిని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో కొంతకాలం పాటూ.. జగన్ మీద అర్థం పర్థంలేని మరిన్ని విమర్శలతో విరుచుకుపడే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.
మామూలుగా చాలా ఆలోచించి, కొమ్ములు తిరిగిన వారితో స్క్రిప్టులు రాయించుకుని.. వాటిని కష్టపడి చదువుతూ మాట్లాడితేనే.. పవన్ మాటల్ని ఎవరూ సీరియస్ గా పట్టించుకోవడం లేదు. ఇక ఆయన ఫ్రస్ట్రేషన్ లో తలాతోకా లేకుండా నిందలు వేయడం ప్రారంభిస్తే జనం అసలు పట్టించుకుంటారా? అని నవ్వుకుంటున్నారు.