ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఈనెల 16 కు వాయిదా వేసింది. అలాగే ఈనెల 16 వరకు అరెస్ట్ చేయొద్దాన్ని పోలీసులకు హైకోర్టు అదేశాలు ఇచ్చింది.
అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కూడా వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో వైసీపీ నేతలు సజ్జల, తలశిల శివరాం, దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఈ నెల 16 వరకు వారిని అరెస్ట్ చేయొద్దాన్ని అదేశాలు ఇచ్చింది.
కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. కోడెల శివప్రసాద్ వర్ధంతి నాడు అయ్యన్న పాత్రుడు ..జగన్మోహన్ రెడ్డిని కించ పరిచారని ఆయనతో చంద్రబాబే ఆ వ్యాఖ్యలు చేయించారని దానిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జోగి రమేష్ తన అనుచరులతో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలు కూడా రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో జోగి రమేష్ పై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసును కొత్తగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో జోగి రమేష్ పేరు ఉండటంతో ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జోగి రమేష్‌కు హైకోర్టులో ఊరట దక్కింది.
అలాగే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే వైసీపీకి చెందిన పవన్, భాగ్యరాజ్, సుధాకర్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు. ఇదే కేసులో ఉన్న వైసీపీ కీలక నాయకులు అరెస్ట్ భయంతో ముందస్తూ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా వారికి బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది.