ప్రభుత్వం పెద్దలు చెప్పారని లేనిపోని కేసులు క్రియేట్ చేస్తే, రేపు జగన్ ప్రభుత్వం వస్తే మన గతేం కావాలనే ఆందోళన కొంత మంది అధికారుల్లో ఉంది. ఈ నేపథ్యంలో సాక్ష్యాత్తు ప్రభుత్వ పెద్దలే ఆదేశించినా, వాళ్లు కోరుకున్నట్టు కేసులు నమోదు చేయడానికి కొంత మంది ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నారని తెలిసింది.
టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ దర్యాప్తునకు తాజా వార్త. అయితే రెండు వారాలుగా అనధికారికంగా ధర్మారెడ్డి హయాంలో అవినీతిని వెలికి తీయాలనే పట్టుదలతో విజిలెన్స్ అధికారులు జల్లెడపడుతున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులపై ప్రభుత్వానికి నమ్మకం లేకపోవడంతో రాష్ట్రస్థాయి అధికారుల్ని రంగంలోకి దింపారు. వారు కూడా టీటీడీలో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రభుత్వ పెద్దలు అందుకు ససేమిరా అన్నారు. ఏదో ఒకటి అవినీతి జరిగిందని చిక్కించుకుని, ధర్మారెడ్డిని జైలుకు పంపాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో మరోసారి టీటీడీలో వెతకాలని ఆదేశించినట్టు తెలిసింది. ఆ పని కూడా మళ్లీమళ్లీ చేశారు. అయినప్పటికీ ఏవీ దొరకలేదు. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో విజిలెన్స్ అధికారులు అసహనానికి గురి అవుతున్నారని తెలిసింది.
ప్రభుత్వ పెద్దలు ఆదేశించారని ధర్మారెడ్డి హయాంలో అవినీతి జరిగినట్టు సృష్టించి, ఆయన్ను జైలుపాలు చేస్తే, భవిష్యత్లో జగన్ సర్కార్ వస్తే, తమను కూడా ఇరికిస్తారనే భయం వారిని వెంటాడుతోంది. అందుకే ప్రభుత్వ పెద్దలు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా కేసులు సృష్టించడానికి వెనకాడుతున్నారని తెలిసింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ప్రభుత్వ పెద్దలది.
ఇప్పటికే విజిలెన్స్ అధికారులతో అనధికారికంగా విచారించి, ఇప్పుడు అధికారికంగా దర్యాప్తునకు ఆదేశించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వ మార్పు, తమ చావుకొచ్చిందని అధికారులు ఆవేదనతో అంటున్నారు.