నయాతరానికి ఉన్న జాడ్యాల్లో ఒకటి ఓవర్ థింకింగ్. గత జనరేషన్ లతో పోలిస్తే ఇప్పుడు ఇది తీవ్రమైన సమస్య! ముప్పై యేళ్ల కిందట కూడా ఇండియాలో తమ వ్యక్తిగత సమస్యల గురించి కూడా తీవ్రంగా చింతించేవారు అయితే కాదు! అన్నింటినీ యాక్సెప్ట్ చేసి ఉన్నదాంట్లో, ఉన్న దాంతో ప్రశాంతంగా గడిపేసే రోజులవి!
అయితే పోటీతత్వం పెరిగిపోయింది, ప్రతి దాంట్లోనూ తామే బెస్ట్ గా ఉండాలి, తాము ప్రశాంతంగా ఉండాలి, ఏ సమస్యలూ రాకూడదు, వచ్చే సమస్యలను ఎలా నివారించాలి, భవిష్యత్తు మాటేంటి, అవకాశాలను ఎలా ఒడిసి పట్టేసుకోవాలి, ఎలా ఎదిగిపోవాలి.. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పటి జనరేషన్లు జీవిస్తున్నాయి!
దీనిలో భాగంగానే ఓవర్ థింకింగ్ కూడా అలవాటు అయిపోయింది. ఉన్నదాంతో ప్రశాంతంగా జీవించేసే వారికి ఓవర్ థింకింగ్ అనే సమస్య ఉండదు! అలాగే అన్నింటా తమ మాటే చెల్లుబాటు కావాలి, అంతా తాము చెప్పినట్టుగానే వినాలి, అందరినీ ప్రభావితం చేసేయాలి.. అనే ధోరణి కూడా ఓవర్ థింకింగ్ కు మరో ముఖ్య కారణం.
ప్రత్యేకించి కార్పొరేట్ ఉద్యోగాల్లో ఈ ధోరణి ఉంటుంది. ప్రతి దానికీ నెగిటివ్ థింకింగ్ కలిగి ఉండటం కూడా ఓవర్ థింకింగ్ లో ఉన్న జాడ్యం! మరి దీన్ని ఎలా నివారించుకోవాలనే అంశం గురించి వ్యక్తిగత్వ వికాస నిపుణులు పలు సలహాలు ఇస్తారు!
బీ ప్రిపేర్డ్ ఫర్ వరెస్ట్!
ఏ అంశం అయితే తమను అతిగా ఆలోచింపజేస్తోందో, ఏ విషయంలో అయితే ఈ ఓవర్ థింకింగ్ వెంటాడుతూ ఉందో.. సదరు అంశంలో హీనపక్షంలో ఏదవుతుందో దానికి ప్రిపేర్డ్ అని ఒక మాట అనేసుకుంటే ఇక మళ్లీ అతిగా థింక్ చేయాల్సిన అవసరం ఉండదనేది నిపుణులు ఇచ్చే ఒక సలహా! ఏదైతే అది అయ్యిందిలే అనుకుని పని మీదే కాన్సన్ ట్రేట్ చేసి, ఫలితం గురించి అతిగా ఆలోచించకవద్దనేది చాలా పురాతనమైన సలహా కూడా!
వర్రీ కావడానికీ టైమ్ కేటాయించండి!
ఇది వినడానికి వింతగానే ఉన్నా, వర్రీ కావడానికి అంటూ రోజులో కొంత సమయం కేటాయించేసుకుని అప్పుడు మాత్రమే తమ చింతలన్నింటినీ గుర్తు తెచ్చుకుని, మిగతా సమయాల్లో వాటిని గుర్తు చేసుకోకుండా ఒక షెడ్యూల్ వేసుకోవాలనే సలహా కూడా నిపుణులే ఇస్తున్నారు! పగలంతా ఓవర్ థింకింగ్ తో సతమతం కావడం కన్నా, అలాంటి ఆలోచనలకు కొంత సమయం కేటాయించేస్తే సరిపోతుందనేది ఈ సలహా సారాంశం. ఆ సమయంలో మినహా మిగతా సమయాల్లో మళ్లీ ఆ ఆలోచనలకు ఆస్కారమే ఇవ్వకూడదనేది ఇక్కడ ఒడంబడిక!
నెగిటివ్ థాట్స్ ను రానివ్వొద్దు!
ఓవర్ థింకింగ్ లో ఉండేది ప్రధానంగా నెగిటివ్ థాట్సే! పాజిటివ్ థాట్స్ ను అయినా మనిషి ఎక్కువ సేపు క్యారీ చేయలేడు కానీ, నెగిటివ్ థాట్స్ గురించి అతిగా ఆలోచించడం మాత్రం అలవాటుగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో నెగిటివ్ థాట్స్ ను గుర్తించుకుని వాటికి ఛాలెంజ్ విసిరేలా వాటిని గుర్తే తెచ్చుకోకుండా మానసికంగా ఎవరికి వారు కౌన్సెలింగ్ ఇచ్చుకోవడం కూడా పరిష్కార మార్గాల్లో ఒకటి. నెగిటివ్ థాట్స్ చాలా వరకూ ఊహాత్మకమైనవే! ఏ మాత్రం వాస్తవం అయ్యే అవకాశం లేనివే! అయినా అవి వెంటాడుతున్నప్పుడు వాటిని గుర్తించి, గుర్తు తెచ్చుకోకపోవడం అనేది ఒక సలహా!
సెల్ఫ్ డెవలప్ మెంట్ మీద దృష్టి
అతిగా ఆలోచించే సమయాన్ని కట్టి పెట్టి.. అదే సమయంలో ఏదైనా ఒక హాబీని అలవరుచుకోవడం, ఆ సమయాన్ని ప్రొడక్టివ్ గా మార్చుకోవడం ఒక తెలివైన కళ! అతిగా ఆలోచనలు మెలిపెట్టే సమయాల్లో పుస్తకాలను చదువుకోవడమో మరేదైనా మంచి హాబీని ఏర్పరుచుకోవడమో ఉత్తమం. దీని వల్ల సెల్ఫ్ డెవలప్ మెంట్ కూడా జరుగుతుంది.
స్ట్రెస్ కలిగించే వాటి జోలికి వెళ్లకపోవడం!
తమ మనస్తత్వం పై అవగాహనతో, ఏవైతే తమను అతిగా ఆలోచింపజేస్తాయో, వేటి జోలికి వెళ్లడం తమను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తుందో అవగాహనను కలిగి ఉండి, అలాంటి అంశాల జోలికే వెళ్లకపోవడం మరొక తెలివైన పని!