అవినీతి కేసులో బావ చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా, తాను టీడీపీని నడిపించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరితపించారు. అయితే టీడీపీని నడిపించేంత సీన్ బాలయ్యకు లేదని సొంత పార్టీ నుంచే కామెంట్స్. లోకేశ్‌ను కూడా జైలుకు పంపుతారని, అప్పుడు నారా బ్రాహ్మణి టీడీపీని నడుపుతారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనడం తెలిసిందే.
ఇటు ఎల్లో మీడియా, అటు టీడీపీ సీనియర్ నేతలు తనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడంతో బాలకృష్ణకు పరువు పోయినట్టు అవుతోంది. తన కుమార్తె బ్రాహ్మణికి రాజకీయాలంటే ఇష్టం లేదని, తాను ఇష్టపడి టీడీపీ పగ్గాలు చేపట్టాలని అనుకుంటే ఎవరూ గుర్తించకపోవడం ఏంటనే ఆవేదన ఆయనలో వుంది. దీంతో తన సత్తా చూపాలని ఆయన అసెంబ్లీ వేదికగా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు మీసాలు తిప్పి, తొడ కొట్టారు. ఈ విషయమై బాలయ్యకు స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెండో రోజైన శుక్రవారం మరో వెకిలి చేష్టకు బాలయ్య దిగారు. విజిల్ వేస్తూ సభలో హల్‌చల్ సృష్టించారు. ఈ సందర్భంగా బాలయ్యకు వైసీపీ నుంచి గట్టి కౌంటర్ పడింది. మంత్రి అంబటి రాంబాబు చమత్కారంతో కూడిన హితవు ఆకట్టుకుంటోంది. బాలయ్యకు అంబటి ఇచ్చిన సలహా ఏంటంటే…
“అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి. జన్మనిచ్చిన తండ్రి కష్ట సమయంలో ఉన్నప్పుడు అండగా నిలబడలేదనే అపవాదు మీతో పాటు మీ అన్నదమ్ముల మీద వుంది. అపవాదు తొలగించుకునే సమయం వచ్చింది. అంతేకాదు మీ బావ జైల్లో, అల్లుడు ఢిల్లీలో ఉన్నారు. ఇదే మీకు సరైన సమయం. పోయి పార్టీ పగ్గాలు తీసుకోండి. నందమూరి వంశమని నిరూపించుకోండి. పార్టీని బతికించుకోండి” అని బాలయ్యకు అంబటి చురకలు అంటించారు.
బాలయ్యకు వైసీపీ నేతల హెచ్చరిక ఎలా వుందంటే… సమయం లేదు మిత్రమా, శరణమా.. రణమా? అంటూ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా డైలాగ్‌ను తలపిస్తోంది. ఈ సినిమాలో హీరో నందమూరి బాలయ్యే కావడం విశేషం. బాలయ్య సినిమాలోని డైలాగ్‌ను ఆయనకే చెబుతూ…అధికార పార్టీ సెటైర్స్‌తో చితక్కొట్టడం చర్చనీయాంశమైంది.