ఫైబ‌ర్ నెట్ కేసులో సాక్షిగా అత‌ను.. టీడీపీకి మ‌రో షాక్‌?

టీడీపీకి శ‌త్రువు, ప్ర‌త్య‌ర్థి వైసీపీ కాదు. తాజాగా చంద్ర‌బాబు అవినీతి కేసులో అరెస్ట్ అయి, రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయ‌న్ను జైలుకు పంపిన స్కిల్ స్కామ్ అవినీతి డొంకను క‌దిలించింది…

టీడీపీకి శ‌త్రువు, ప్ర‌త్య‌ర్థి వైసీపీ కాదు. తాజాగా చంద్ర‌బాబు అవినీతి కేసులో అరెస్ట్ అయి, రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయ‌న్ను జైలుకు పంపిన స్కిల్ స్కామ్ అవినీతి డొంకను క‌దిలించింది వైసీపీ ప్ర‌భుత్వం అనుకుంటే పొర‌పాటే. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలోని సంస్థ 2018లో అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వానికి రాసిన లేఖే, ఇప్పుడీ ప‌రిణామాల‌కు దారి తీసింది.

తాజాగా ఫైబ‌ర్‌నెట్ స్కామ్‌పై కూడా వైసీపీ ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. ఈ అవినీతి బాగోతాన్ని వైసీపీ ప్ర‌భుత్వం క‌నుక్కున్న‌దేమీ లేదు. గ‌తంలో ఫైబ‌ర్ నెట్‌లో స్కామ్ జ‌రిగింద‌ని ఏకంగా న్యాయ పోరాటం మొద‌లు పెట్టిన న్యాయ‌వాది మ‌రెవ‌రో కాదు…ఇప్పుడు సొంత‌ పార్టీ పెట్టుకుని టీడీపీ అనుకూల వాద‌న‌లు వినిపిస్తున్న జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్‌. తాజాగా ఫైబ‌ర్‌నెట్ స్కామ్‌లో జ‌డ శ్ర‌వ‌ణ్‌ను కేసులో సాక్షిగా పెట్టేందుకు వైసీపీ ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఫైబ‌ర్‌నెట్‌లో పెద్ద ఎత్తున ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని మొట్ట‌మొద‌ట గుర్తించి, దాని అంతు తేల్చేందుకు న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మైన వ్య‌క్తి జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్‌. గ‌తంలో ఈ కేసుకు సంబంధించి ఆయ‌న అన్న మాట‌ల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అప్పుడు ఆ కేసుకు సంబంధించి ఆయ‌న ఏమ‌న్నారంటే…

“ఫైబ‌ర్ నెట్‌లో స్కామ్ జ‌రిగింది. దీనికి సంబంధించి ఆరుగురిపై కేసు ఫైల్ చేశాం. వీరిలో ఇద్దరు ప్ర‌భుత్వ అధికారులున్నారు. ప్ర‌ధానంగా స్కామ్‌లో ఏ1గా చంద్ర‌బాబునాయుడు, ఏ2 లోకేశ్‌, ఏ3 వేమూరి ర‌వికుమార్‌, ఏ4గా ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ఉన్నారు. వీరు అక్ర‌మంగా సంపాదించారు. డొల్ల కంపెనీల‌కు అనుమ‌తించార‌నేది నా అభియోగం” అని జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ గతంలో మీడియాతో మాట్లాడుతూ కేసుకు సంబంధించి కీల‌క విష‌యాలు చెప్పారు.

రాజ‌కీయంగా నేడు టీడీపీతో జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ స‌న్నిహితంగా వుండొచ్చు. కానీ జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ ఒక కేసును టేకప్ చేశారంటే, అందులో న్యాయం వుంటుంద‌నే విశ్వ‌స‌నీయ‌త వుంది. జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ రాజ‌కీయంగా త‌న అభిప్రాయాల్ని మార్చుకుని వుండొచ్చు. అలాగే ఏ కార‌ణంతోనైనా పైబ‌ర్ స్కామ్ కేసును ఆయ‌న విత్‌డ్రా చేసుకుని వుండొచ్చు. కానీ జ‌డ శ్ర‌వ‌ణ్ ఆరోపించిన‌ట్టుగా ఫైబ‌ర్‌లో స్కామ్ జ‌రిగింద‌నేది వాస్త‌వం అని జ‌నం న‌మ్ముతున్నారు. ఆధారాలు లేనిదే జ‌డ శ్ర‌వ‌ణ్ కేసు వేయ‌ర‌ని టీడీపీ శ్రేణులు కూడా చ‌ర్చించే ప‌రిస్థితి.

ఈ కేసులో జ‌డ శ్ర‌వ‌ణ్‌ను సాక్షిగా తీసుకుంటే, ప్ర‌భుత్వ సొమ్మును కాపాడ‌డంతో పాటు టీడీపీ ప్ర‌భుత్వ  అవినీతిని బ‌య‌ట‌పెట్టొచ్చ‌ని వైసీపీ ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం. శ్ర‌వ‌ణ్ త‌న పార్టీ పేరులో అంబేద్క‌ర్‌, అలాగే భార‌త్ అని కూడా పెట్టుకున్నార‌ని, ఆయ‌న‌కు దేశ భ‌క్తి, రాజ్యాంగంపై అచంచ‌ల విశ్వాసం ఉండ‌డంతో ఫైబ‌ర్ స్కామ్‌కు సంబంధించి అంతా నిజ‌మే చెబుతార‌ని రాజ‌కీయానికి అతీతంగా అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు. శ్ర‌వ‌ణ్ నోరు తెరిస్తే మాత్రం చంద్ర‌బాబు, లోకేశ్‌ల ప‌రిస్థితి ఊహాతీతం అని చెప్ప‌క త‌ప్ప‌దు.