ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఇవాల్టితో రిమాండ్ ముగియగా.. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని సీఐడీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఈ నెల 24 వరకు పొడిగించింది.
బాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. జడ్జి ముందు తన వాదనలు వినిపించిన బాబు.. రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేసినట్లు వాపోయారు. తన అరెస్టు అక్రమంగా జరిగిందని.. చెయ్యని తప్పు చేశానని చెబుతున్నారంటూ జడ్జ్ ముందు చంద్రబాబు తన గోడు వెల్లబుచ్చారు.
చంద్రబాబు వాదనలు విన్న న్యాయమూర్తి.. రిమాండ్‌ను శిక్షగా భావించవద్దని.. చట్టం ఎవరికైనా సమానమేనని.. దర్యాప్తులో అన్నీ తేలుతాయి.. జైలులో ఇబ్బందులు ఉంటే కోర్టు దృష్టికి తీసుకురావాలి అంటూ చంద్రబాబుకు సూచించారు. దీంతో 24 వరకు రాజమండ్రి జైలులోనే చంద్రబాబు ఉండనున్నారు. మరోవైపు కాసేపట్లో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇవ్వనుంది.