అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ నిర్ణయించిన రోజే అంతా అనుమానించారు. ఇదేదో గొడవ సృష్టించడానికే ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుందని. అనుమానమే నిజమైంది. అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు అరెస్ట్‌పై రగిలిపోతున్న టీడీపీ, ఆ కోపాగ్నిని అసెంబ్లీలో ప్రదర్శించేందుకు వెళ్లింది.
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే బాబు అరెస్ట్‌పై తీవ్ర నిరసనకు దిగింది. బాబు అరెస్ట్‌పై చర్చకు పట్టుపట్టింది. చర్చిద్దామని, దానికో పద్ధతి వుందని అధికార పక్షం చెప్పినా వినిపించుకోలేదు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నానా రభస చేశారు. బాలయ్య అసెంబ్లీలో తొడ కొట్టి, మీసం తిప్పి సినిమాను తలపింపచేశారు. ఇవాళ విజిల్స్ వేస్తూ మరోసారి బాలయ్య చిల్లరగా వ్యవహరించారనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు.
వరుసగా రెండు రోజుల సమావేశాల్లో కొందరు ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ ఐదురోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే మరికొందరిపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
సభలో తమ హక్కులకు భంగం కలిగించడంలో సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించామని ఆయన చెప్పారు. అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా మార్చారని అచ్చెన్న విమర్శించడం గమనార్హం. శాసనసభతో మండలి సమావేశాలకు కూడా హాజరు కావద్దని నిర్ణయించుకున్నట్టు అచ్చెన్న తెలిపారు.
దమ్ముంటే ఐదు రోజులు చర్చ పెడితే, జగన్ అవినీతిపై అసలు సినిమా చూపిస్తామని అచ్చెన్న సవాల్ విసరడం విశేషం. సభలో తనను స్పీకర్ యూజ్‌లెస్ ఫెలో అని తిట్టారని అచ్చెన్నాయుడు వాపోయారు. స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలని ఆయన హితవు చెప్పారు.