అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజ్ఞత ప్రదర్శించారు. తన వైపు నుంచి తప్పు జరిగిందని తెలుసుకుని ఆయన క్షమాపణలు చెప్పడం విశేషం. తన తప్పు గురించి చెప్పగానే ఎక్కడా ఇగో ఫీల్ కాకుండా ఆయన సానుకూల ధోరణిలో స్పందించడం అభినందించదగ్గ విషయం.
ఇటీవల విడుదలైన తన సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ దేవ బ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని , వారి అధిపతి రావణాసురుడు అని చెప్పారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై దేవబ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరిస్తూ మాట్లాడిన బాలయ్య క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వారి నుంచి వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో దేవాంగుల మనోభావాలు దెబ్బతిన్న సంగతి బాలయ్య దృష్టికి వెళ్లింది. దేవ బ్రాహ్మణుల నాయకుడు రావణ బ్రహ్మ అని తాను చెప్పింది తప్పు అని తెలుసుకున్నారు. దీంతో ఆయన దేవాంగులకు బహిరంగ క్షమాపణ చెబుతూ బహిరంగ లేఖను విడుదల చేయడం గమనార్హం. ఆ లేఖలో ఏముందంటే…
‘దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అనడం తప్పు అని నాకు తెలియజేసిన దేవబ్రహ్మణ పెద్దలందరికి పేరు పేరునా కృతజ్ఞతలు. నా మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఆ సందర్భంలో దురదృష్టవశాత్తు నా నుంచి అలాంటి మాట వచ్చింది. దేవాంగులలో నా అభిమానులు చాలా మంది ఉన్నారు. నా వాళ్లను నేను బాధపెడతానా? అర్థం చేసుకుని నా నుంచి దొర్లిన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’ అని ఆయన వేడుకున్నారు. బాలయ్య పండగ పూట మంచి మూడ్లో వుండి క్షమాపణలు చెప్పినట్టున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.