విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ నేతల గురించే ఆయన పరోక్షంగా తీవ్ర పదజాలాన్ని ప్రయోగించడం చర్చనీయాంశమైంది. నందిగామలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సొంత తమ్ముడు చిన్నిపై నేరుగా, అలాగే బొండా ఉమా, బుద్ధా వెంకన్నల గురించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేయడం టీడీపీని షాక్‌కు గురి చేస్తోంది.
కేశినేని చిన్న పార్టీలో యాక్టీవ్‌గా ఉన్నారనే ప్రశ్నకు ఎంపీ స్పందిస్తూ… మంచిదే కదా అని అన్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే చేస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించంగా సీరియస్ కామెంట్స్ చేశారు. చచ్చినా చేయనని తేల్చి చెప్పారు. అంతటితో ఆయన ఆగలేదు. మొదటి నుంచి తనకు గిట్టని బుద్ధా వెంకన్న, బొండా ఉమాలపై కూడా పరుష పదజాలాన్ని వాడారు.
టీడీపీలో ముగ్గురు నేతలు ఉన్నారని, వారికి సీట్లు ఇస్తే పార్టీలో పనిచేయనని కేశినేని నాని హైకమాండ్‌కు తేల్చి చెప్పారు. చీటర్లు, రియల్ ఎస్టేట్ మోసగాళ్లు, సెక్స్ వర్కర్లు, కాల్ మనీ గాళ్ళకు టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వనన్నారు. తమ్ముడి వెంట తిరగమంటే తానెందుకు తిరుగుతానని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. తనకు క్యారెక్టర్ ఉందని, రాజకీయాల్లో ఎవరినీ మోసం చేయడానికి రాలేదన్నారు.
ఎన్నికల్లో దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ లాంటి అంతర్జాతీయ 420 గాళ్లు కూడా పోటీ చేసే హక్కు ఉంటుందని.. అంతమాత్రాన వాళ్లకు మద్దతు ఇవ్వమంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీలో ప్రక్షాళన జరగాలని ఆయన చెప్పుకొచ్చారు. కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో బుద్ధా వెంకన్న, బొండా ఉమా పేర్లు ఉన్నట్టు వైసీపీ నేతలు అనేక మార్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని దృష్టిలో పెట్టుకుని కేశినేని నాని వారిపై నర్మగర్భ విమర్శలు చేశారని టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది.