ఎంతటి హీరోలు అయినా అవసరం అయినపుడు ట్యూషన్ కు వెళ్లాల్సిందే. లేదా ట్యూషన్ చెప్పించుకోవాల్సిందే. సినిమా, కథ డిమాండ్ చేస్తే తప్పదు. అందుకే హీరో విజయ్ దేవరకొండ ఒక ట్యూషన్ కోసం జానపద గాయకుడు, రచయిత పెంచల్ దాస్ ను సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే చిత్తూరు యాస, చిత్తూరు ప్రాంతంలో మాట్లాడే తెలుగు నేర్చుకోవడం కోసం.
ఇప్పటికే ఇదే పని అల్లు అర్జున్ చేసేసాడు. పైకి వార్తలు రాకుండానే పుష్ప సినిమా కోసం చిత్తూరు యాస భాష నేర్చుకున్నాడు. ఫుల్ సక్సెస్ అయ్యాడు. త్వరలో విజయ్ దేవరకొండ చేయబోయే గౌతమ్ తిన్న నూరి సినిమా కోసం ఇదే పని అవసరం పడింది. ఇలాంటి వాటికి మనవాళ్లు చూసేది పెంచల్ దాస్ వైపే.
ఇప్పటికే తెలుగులో కొన్ని మంచి జానపద గీతాలు అందించాడు. అరవింద సమేత సినిమా కోసం త్రివిక్రమ్ తో కలిసి పనిచేసారు. సో, విజయ్ ఇప్పుడు అతగాడినే సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. అసలే విజయ్ తెలుగు తెలంగాణ స్లాంట్ లో ఓ డిఫరెంట్ స్టయిల్ లో వుంటుంది. దాన్ని చిత్తూరు స్లాంట్ కు మార్చడం అంటే చిన్న ఎక్సర్ సైజ్ కాదు. ఈ వర్క్ కు ఏ మేరకు కష్టపడాల్సి వుంటుందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఈ పని కోసం పెంచల్ దాస్ త్వరలో హైదరాబాద్ లో విజయ్ కు ట్యూషన్ మొదలుపెట్టే అవకాశం వుందని తెలుస్తోంది.