ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో రెండు వర్గాలున్నాయి. సొంత పార్టీకి చెందిన నాయకులే తనను బద్నాం చేయడానికే కట్టు కథలు అల్లి ప్రచారం చేస్తున్నారని, అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని ఆ మధ్య మీడియా సాక్షిగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ప్రకాశం జిల్లా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. ముఖ్యంగా రెండో దఫా కేబినెట్ విస్తరణలో భాగంగా తనను తప్పించి, సొంత జిల్లాకు చెందిన ఆదిమూలం సురేష్‌ను కొనసాగించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రకాశం జిల్లాలో తన బంధువే వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారనేది బాలినేని ఆరోపణ, ఆవేదన. తననెవరైతే రాజకీయంగా టార్గెట్ చేశారని బాలినేని అనుమానిస్తున్నారో, ఆ నాయకుడికి వ్యతిరేకంగా ఆయన కూడా ఆట మొదలు పెట్టారు. బాలినేని మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
“వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి నేను పోటీ చేస్తాను. అలాగే మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు. కొంత మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాటిని నమ్మొద్దు” అని ఆయన అన్నారు.
రానున్న ఎన్నికల్లో ఒంగోలు నుంచి తాను పోటీ చేయడం వరకూ క్లారిటీ ఇవ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా పోటీ చేస్తారని బాలినేని చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. మాగుంట పోటీపై తేల్చి చెప్పడానికి బాలినేని ఎవరని ప్రకాశం జిల్లా వైసీపీలోని ఆయన వ్యతిరేక వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు నుంచి వైసీపీలోని మరో కీలక నాయకుడు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసి కూడా, ఉద్దేశ పూర్వకంగా, గిల్లడానికే బాలినేని ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు.
మాగుంటపై అభిమానం కంటే, మరెవరిపైనో కోపంతో బాలినేని ఒంగోలు లోక్‌సభ స్థానం గురించి ప్రస్తావించారనే చర్చకు తెరలేచింది. ఇలా ఎవరికి వారు టికెట్లను ప్రకటిస్తూ పోతే, ఇక సీఎం వైఎస్ జగన్ ఎందుకని బాలినేని వ్యతిరేక వర్గీయులు నిలదీస్తున్నారు. సర్వే నివేదికల ఆధారంగా టికెట్లను ఖరారు చేస్తానని సీఎం చెబుతున్నా, ఆయన మాటలను పట్టించుకోకుండా బాలినేని తనకు సంబంధం లేని అంశాలపై మాట్లాడ్డం ఎవరి కళ్లలో ఆనందం కోసమని ప్రశ్నిస్తున్నారు.