ప్రజాయుద్ధనౌక గద్దర్ జీవితమంతా అభాగ్యుల క్షేమం కోసం పరితపించారు. జీవిత చరమాంకంలో విప్లవ పంథా వీడి, ఓటు బ్యాంక్ రాజకీయాలపై ఆసక్తి చూపినా, ఆయన ప్రజాపక్షమే వహించారు. చంద్రబాబు పాలనలో ఆయన శరీరంలోకి దూసుకెళ్లిన తూటా మరణం వరకూ గద్దర్‌తో పాటు ఉండింది. ఈ విషయాన్ని ఆయన కవితాత్మకంగా చెప్పేవారు. ఇటీవల భౌతికంగా ఆయన ఈ లోకాన్ని వీడారు.
గద్దర్‌తో సైద్ధాంతిక విభేదాలున్న ఎంతో మంది ఆయనకు ఘన నివాళి అర్పించారు. ప్రజల కోసం పని చేయడంలో గద్దర్ నిబద్ధతను స్ఫూర్తిగా తీసుకోవాలని అనేక మంది ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో మంగళవారం గద్దర్ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్లారు. గద్దర్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1997లో గద్దర్‌పై కాల్పుల ఘటన గురించి చెప్పుకొచ్చారు.
గద్దర్‌పై తానే కాల్పులు జరిపించినట్టు తప్పుడు ప్రచారం చేశారని వాపోయారు. తన లక్ష్యం, గద్దర్ లక్ష్యం ఒకటే అని ఆయన అనడం చర్చనీయాంశమైంది. పేదల హక్కుల పరిరక్షణే ధ్యేయమని చంద్రబాబు అన్నారు. గద్దర్‌తో పాటు తాను కూడా పేదల హక్కుల కోసం పని చేస్తున్నానని చెప్పుకోవడం ఆయన ఉద్దేశంగా కనిపించింది.
పేదల రక్తం రుచి మరిగిన నాయకుడు చంద్రబాబు అని గద్దర్ తీవ్రస్థాయిలో విమర్శించడాన్ని జనం ఇంకా గుర్తు పెట్టుకునే ఉన్నారు. ప్రపంచ బ్యాంకుకు చంద్రబాబు ఊడిగం చేస్తూ, పేద ప్రజానీకాన్ని పీడిస్తున్నాడని చంద్రబాబుపై పాటలు పాడిన చరిత్ర గద్దర్‌ది. గద్దర్‌ది, తనది ఒకే లక్ష్యమని చంద్రబాబు అన్న మాటలు వింటే… ప్రజా యుద్ధనౌక మరోసారి చచ్చిపోతాడని పౌర సమాజం వ్యంగ్యంగా అంటోంది.