మరోసారి రాసిపెట్టుకోమంటున్న బండ్ల..!

గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాసిపెట్టుకోమన్నాడు. కాంగ్రెస్ పవర్ లోకి రాకపోతే 'సెవెన్ ఓ క్లాక్' బ్లేడ్ తో గొంతు కోసుకుంటానన్నాడు. ఇప్పుడు ఏపీలో పవన్ కల్యాణ్ సీఎం అవుతారు రాసి…

గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాసిపెట్టుకోమన్నాడు. కాంగ్రెస్ పవర్ లోకి రాకపోతే 'సెవెన్ ఓ క్లాక్' బ్లేడ్ తో గొంతు కోసుకుంటానన్నాడు. ఇప్పుడు ఏపీలో పవన్ కల్యాణ్ సీఎం అవుతారు రాసి పెట్టుకోండి అంటున్నాడు నిర్మాత, కమెడియన్ బండ్ల గణేశ్. ఈసారి ఏ కంపెనీ బ్లేడ్ తెచ్చుకోవాలో కూడా చెబితే బాగుంటుంది.

బండ్ల సెంటిమెంట్ ని నమ్ముకుంటే..?

రాజకీయాల్లో బండ్ల సెంటిమెంట్ అంటూ ఒకటుంది. ఆయన రాసిపెట్టుకోండి అంటే కచ్చితంగా దానికి రివర్స్ లో జరుగుతుందనే అనుకోవాలి. అందులోనూ ఆయన అంత పట్టుబట్టి చెప్పారంటే కచ్చితంగా అనుమానించాల్సిందే. 

గతంలో కాంగ్రెస్ పరిస్థితి అధోగతి అయింది, ఇప్పుడు పవన్ కల్యాణ్ పరిస్థితి ఇప్పుడున్నదాని కంటే ఘోరంగా అయిపోతుందేమో చూడాలి. బండ్లన్న మాటా, మజాకా..?

బండ్లకు అంత ప్రయారిటీ అవసరమా..?

ఓ మోస్తరు కమెడియన్, గతంలో కొన్ని హిట్ సినిమాలు తీసిన నిర్మాత, ఇటీవలే సీరియస్ యాక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వ్యక్తి. ఇదీ క్లుప్తంగా బండ్ల హిస్టరీ. వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఆయన్ని, ఆయన మాటల్ని ఎవరూ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.  అయితే బండ్ల అంతకు మించి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. గతంలో రాజకీయల్లో ఎంట్రీ ఇచ్చి చేయి కాల్చుకున్నారు.

కానీ బండ్ల గణేశ్ అనే వ్యక్తి పవన్ కల్యాణ్ పేరు చెప్పుకుని బతికేస్తుంటారు. పవన్ కల్యాణ్ అభిమానుల్లో బండ్లకి కూడా వీరాభిమానులున్నారు. పవన్ ని ఎలివేట్ చేసి, సోషల్ మీడియాలో తాను కూడా పాపులర్ అనిపించుకున్నారు బండ్ల. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన ట్వీట్లు వేసి మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడిలా పవన్ కల్యాణ్ సీఎం అంటూ మరో హాట్ టాపిక్ తెరపైకి తెచ్చారు.

పవన్ ని సీఎం అంటే ఆయన అభిమానులు, లబ్దిదారులు సంబరపడిపోతారు కానీ, అంతకు మించి ఇంకేమీ కాదు. కాకపోతే రాసిపెట్టుకోండి అంటూ బండ్ల స్టేట్ మెంట్ ఇచ్చారు కాబట్టి.. అలా కాకపోతే తాను ఏం చేస్తాననే విషయం కూడా బండ్ల చెబుతారేమో చూడాలి. గతంలో సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ తో కోసుకుంటానంటున్న బండ్ల.. ఇప్పుడు కూడా అలాంటి రెమెడీ ఏదైనా చెబుతారా.. లేక పవన్ సీఎం అనేది జస్ట్ రాసి పెట్టుకోడానికేనా.. వేచి చూడాలి.