కొందరి ఎదుగుదల ఇన్ స్పయిరింగ్ గా వుంటుంది. కొందరి ఎదుగుదల ఆశ్చర్యంగా వుంటుంది. కొందరి విషయంలో అదృష్టం సాయం చేసింది అనుకుంటాం. కానీ నిచ్చెన వేసుకుని, తొక్కిన, ఎక్కిన ప్రతి మెట్టును మళ్లీ ఎవరికీ ఉపయోగపడకూడదనేంతగా విరిచేస్తూ, తాను మాత్రం పైకి ఎక్కిపోతే ఆ ఎదుగుదల ను ఆదర్శంగా తీసుకోవడం అంత మంచిది కాదు.
దొరికిన ప్రతి అవకాశాన్నీ వాడుకుని ఎదగడం మంచిదే. కానీ దొరికిన ప్రతి వాడినీ వాడుకుని వదిలేయడం మంచిది కాదు. కేవలం వదిలేయడమే కాదు, నిర్వీర్యం చేయడం మరీనూ. కానీ ఇవన్నీ అనసరం ఎదిగిరా లేదా? అన్నదే పాయింట్ అయితే, ఆ విధంగా చంద్రబాబు నాయుడు గ్రేట్. రాజకీయాలకు ఇలాంటి తెలివి తేటలే కావాలి. దాన్నే విజన్ అంటారు అని ఎవరైనా అంటే, ఆ విధంగా చంద్రబాబు నాయుడు గ్రేట్.
చంద్రబాబు ఎదుగుదలను ఓ సారి చూద్దాం. యూత్ లీడర్ గా కాంగ్రెస్ లోకి ప్రవేశం. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో దోస్తీ. ఎన్టీఆర్ అల్లుడు కాగానే అడ్డదారిలో రుణం సంపాదించి హోటల్ కట్టారన్న ఆరోపణలు. దాంతో అర్జెంట్ ఆ విష్ణు ప్రియ హోటల్ ను అమ్మేసిన వైనం. కాంగ్రెస్ నుంచి తేదేపాకు వచ్చారు. రాజకీయాల్లో అది కామన్. మెల్లగా పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. చురుకైన వారికి అది కూడా కామన్.
కానీ అక్కడ తనకు అడ్డం పడతారు అనుకున్నవారిని మెలమెల్లగా తప్పించడం ప్రారంభించారు. తెలుగుదేశంలో అప్పట్లో బయటకు వెళ్లినవారంతా ఎన్టీఆర్ ను ఏమీ అనలా? చంద్రబాబే తమను బయటకు పోయేలా చేసాడని ఆరోపించారు. ఉపేంద్ర, రేణుక, జయప్రద ఇలా జాబితా పెద్దదే వుంది. ఆఖరికి స్వంత తోడల్లుడు వెంకటేశ్వరరావు, స్వంత బామ్మర్ది హరికృష్ణలు కూడా చంద్రబాబు అంటే దూరం..దూరం అనే పరిస్థితి.
ఇలాంటి టైమ్ లో తెలివిగా ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. కొందరు వెన్నుపోటు అన్నారు. బాబుగారి అనుకూల మీడియా దాన్ని పార్టీ రక్షణ అంటూ టముకేసింది. ఇదే మీడియా పెద్దోళ్లను నమ్మి సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ బలైపోయారు. పార్టీని చేతుల్లోకి తీసుకున్న టైమ్ లో తోడల్లుడు దగ్గుబాటిని, బామ్మర్దులు హరికృష్ణ, బాలకృష్ణలను దగ్గరకు తీసారు.
కానీ హరికృష్ణను మెల్లగా తప్పించారు. బాలయ్యను ఎమ్మెల్యేకు పరిమితం చేసారు. దానికి గాను తన కొడుకు బాలయ్య అల్లుడిని చేసి, అడ్డం పెట్టారు. ఇంకేం మాట్లాడతారు బాలయ్య.. కేవలం స్వంత ఇంట్లోనే కాదు ఎక్కడయినా యూజ్ అండ్ త్రో వ్యవహారామే.
ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకోవడం, దాన్ని వదిలేయడం, మళ్లీ మరో పార్టీతో చేతులు కలపడం, ఈ లోగా పొత్తు వదిలేసిన పార్టీ జనాలు బాబును విమర్శించడం ఇదే తంతు. అంతెందుకు హెరిటేజ్ ను బాలకృష్ణ, మోహన్ బాబు లతో కలిసి భాగస్వామ్యంతో ప్రారంభించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు హోల్ అండ్ సొల్ చంద్రబాబు ఫ్యామిలీనే. ఇద్దరు కూతుర్లు, మనవళ్లు వున్నా కూడా చంద్రబాబు మనవడికే టోటల్ హెరిటేజ్ షేర్లు బాలయ్య ఇచ్చేసారు అంటే చంద్రబాబు చాణక్యం అర్థం అవుతుంది కదా..ఆ విధంగా చంద్రబాబు గ్రేట్ నే.
తన మనుషుల్ని ముందు చూపుతో వివిధ వ్యవస్థలో ప్రవేశపెట్టడం, వారి ద్వారా పనులు చక్క బెట్టించడంలో గొప్ప విషయం అయితే ఆ విధంగా గ్రేట్ నే. ఆ ముందు చూపునే విజన్ అనాలేమో? కమ్మ సామాజిక వర్గానికి మరో సరైన నాయకుడు లేకుండా చేయడంలో కూడా చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అందుకే వారంతా ఆయననే నమ్ముకుని ముందుకు సాగాల్సి వస్తోంది. బాలయ్య, దగ్గుబాటి, హరికృష్ణ ఇలాంటి అవకాశాన్ని ఎలా కొల్పోయారు అంటే బాబుగారి గ్రేట్ నెస్ వల్లే అనుకోవాలి.
రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్, మెట్రో వైఎస్, కేసిఆర్ ఎగ్జిక్యూట్ చేసినా తనదే ఘనత అంటారు చంద్రబాబు. ఇప్పటికీ హైదరాబాద్ కు ఏ కంపెనీ వచ్చినా, అప్పట్లో తను వేసిన పునాది రాయి వల్లే అంటారు. ఈ విషయం టముకేయడానికి చాలా మందే రెడీగా వున్నారు. అందువల్ల చంద్రబాబు గ్రేట్ నే.
తను పసుపు కుంకుమ అంటూ అప్పు చేసి డబ్బులు పంచేయవచ్చు. వివిధ కార్పొరేషన్ల ను ఏర్పాటు చేసి రుణాల మార్గాలు అన్వేషించవచ్చు. రాజధాని మీద బాదపడకుండా వివిధ ప్రాంతాలకు వరాలు అంటూ ప్రకటించి మరిచిపోవచ్చు, కానీ అవతలి వారు పంచకూడదు, రుణాలు చేయకూడదు. వరాలు ఇవ్వకూడదు. ఇదే గొప్ప విషయం అంటే బాబు గ్రేట్ నే.
వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాను అంటే ఏంటో అనుకున్నారంతా, ప్లాట్ లు వేసి అమ్మేసుకుంటే లాభమే కదా అని అనుకోలేదు. అలా అమ్మేసిన రైతులు ఫ్యాకర్టీల్లో ఆఫీసుల్లో వర్కర్లుగా మారి కౌలు లేదా ఫలసాయం కన్నా ఎక్కువగా జీతం తెచ్చుకుంటే లాభసాటినే కదా అని అనుకోలేదు. అదీ బాబు విజన్. అందుకే ఆయన గ్రేట్.
ఇప్పుడు కూడా తను కానీ తన పార్టీ కానీ ఏం చెప్పినా, ఏ విమర్శించినా జనం నమ్మడం మానేసారు అని జనసేనను, దాని అధిపతిని ఆ పని మీదకు వెళ్లేలా చేసిన బాబుగారి విజన్ గ్రేట్ కదా.
70 ఏళ్లు పైబడిన ఈ వయస్సులో ఇంకా యాక్టివ్ గా హైదరాబాద్ ఇంటి నంచే పని చేస్తున్న బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు