మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త మద్దూరి భార్గవ్రామ్కు టీడీపీ పెద్దలు చీవాట్లు పెట్టినట్టు సమాచారం. నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. భారీ మొత్తంలో వారి నుంచి డబ్బు రాబట్టే క్రమంలో తన భర్త భార్గవ్‌రామ్‌తో అఖిలప్రియ నామినేషన్ వేయించినట్టు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుమార్తె ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు అఖిలప్రియ దంపతుల వైఖరిపై టీడీపీ అధిష్టానం దృష్టికి బైరెడ్డి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో టీడీపీ పెద్దలు రంగంలోకి దిగారు. అఖిలప్రియ, ఆమె భర్తతో మాట్లాడినట్టు తెలిసింది. డబ్బు ఇస్తే తప్ప నామినేషన్ ఉపసంహరించేది లేదని అధిష్టానం పెద్దలకు తేల్చి చెప్పినట్టు మొదట ప్రచారం జరిగింది. దీంతో అధిష్టానం పెద్దలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలాగైతే పక్కన పెట్టాల్సి వస్తుందని హెచ్చరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దీంతో అఖిలప్రియ దంపతులు తగ్గినట్టు తెలిసింది. దీంతో నామినేషన్ విత్ డ్రా చేసుకోడానికి సంబంధిత పత్రాలపై భార్గవ్‌రామ్ సంతకాలు చేసినట్టు సమాచారం. సోమవారం నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజు. దీంతో రెబల్స్, అలాగే తమకు ఇబ్బంది కలిగిస్తారనే అనుమానం వున్న వారి నామినేషన్లను రాజకీయ పార్టీల నాయకులు ఉపసంహరణ చేసేలా ఒత్తిడి చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ప్రధాన పార్టీల్లో ఏ మాత్రం ఫలిస్తాయో చూడాలి.