సాధారణంగా ఏ పార్టీ మేనిఫెస్టో ఆ పార్టీకి ఆయుధంగా ఉంటుంది! అయితే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టోనే పెద్ద ప్రతిబంధకం మారుతోంది! గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అడ్డగోలు హామీలను ఇస్తూ మేనిఫెస్టోని ప్రకటించారు! అయితే ఆ హామీలను నెరవేర్చడం సంగతలా ఉంచితే, తన మేనిఫెస్టోని తమ పార్టీ వెబ్ సైట్ నుంచి డిలీట్ చేయించిన ఘనత చంద్రబాబుది!
ఎక్కడ మేనిఫెస్టో వెబ్ సైట్లో ఉంటే, దాన్ని పట్టుకుని, అదేమైంది, ఇదేమైంది.. అంటూ జనాలు అడుగుతారనే భయంతో చంద్రబాబు నాయుడు పార్టీ వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టోని డిలీట్ చేయించారు! తమ మేనిఫెస్టోని ఏ పార్టీ అయిన పవిత్రంగానే భావించాలి! అయితే అలాంటి పట్టింపులు ఏమీ లేకుండా నిస్సిగ్గుగా అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోని వెబ్ సైట్లో లేకుండా డిలీట్ చేయించిన ఘనత టీడీపీది!
ఇక ఆ డిలీట్ చేయించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కావు! వ్యవసాయ రుణమాఫీ, తాకట్టులోని బంగారును విడిపించడం, నిరుద్యోగ భృతులు.. పెన్షన్ల పెంపు.. ఇంటికో ఉద్యోగం ఇలా కోకొల్లల హమీలున్నాయి! 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అలాంటి అడ్డమైన హామీలను ఇచ్చారు. ఆ హామీల వల కూడా అప్పట్లో పని చేసింది. ఆ ఎన్నికల్లో అనంతపురం వంటి జిల్లాలో టీడీపీకి 14 అసెంబ్లీ సీట్లలో 12 దక్కాయంటే.. అందుకు కారణం వ్యవసాయ రుణమాఫీ, తాకట్టులోని బంగారాన్ని విడిపిస్తామనే హామీనే! అయితే ఆ హామీలను చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారు. అదేమంటే ఎదురుదాడి చేశారు. అడుగుతున్నారని మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేయించారు!
తను ఏం చెబితే అదే జనాలు నమ్ముతారు, అదే వింటూ ఉంటారనేది చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రగాఢ నమ్మకం! అయితే జనాలు మరీ అంత పిచ్చోళ్లు కాదని 2019 ఎన్నికల నాటికి చంద్రబాబుకు కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు జగన్ తెలుగుదేశం పాత మేనిఫెస్టోని బయటకు పట్టుకొచ్చారు. 2014 ఎన్నికల ముందు ఏయే హామీలు ఇచ్చారు.. అధికారం పొందాకా ఏమేం చేశారో జగన్ జనాలకు విశదీకరిస్తున్నారు!
మరి అప్పుడేమో గారడీలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేసి, పోలింగ్ అయిపోయిన వెంటనే దాన్ని పడేసిన చంద్రబాబు ఇప్పుడు మరో మెనిఫెస్టోని విడుదల చేస్తున్న తరుణంలో.. పాత మెనిఫెస్టో కథ తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టేదిగా మారింది. జగన్ జనాల మధ్యన ఆ మేనిఫెస్టోని చూపిస్తూ.. చంద్రబాబు విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉన్నాడు!