ఇప్పటి దాకా తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో ఒక్క రుణమాఫీ వ్యవహారం మాత్రమే రచ్చ రచ్చ అవుతున్నది. తాజాగా ఇప్పుడు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలు ఈ నాలుగు నెలల తమ పరిపాలనకు రెఫరెండం వంటివి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు.
ఒకవైపు భారతీయ జనతా పార్టీ 10కి పైగా స్థానాలు గెలవాలని ఆశపడుతుండగా, మరొకవైపు అసెంబ్లీ ఎన్నికలలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న భారత రాష్ట్ర సమితి తమ ఏకంగా 15 స్థానాలు గెలుస్తాం అని విర్రవీగుతుండగా.. సంక్లిష్టమైన పోరుని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ తమ నాలుగు నెలల పరిపాలనకు రెఫరెండంగా భావించడం అనేది, ఆ మాట అనడానికి సిద్ధపడటం అనేది పెద్ద సాహసం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో ఐదింటిని ఇప్పటికే అమలు చేశారు. కానీ రుణమాఫీ వ్యవహారం రచ్చ రచ్చ అవుతున్నది. ఐదు నెలలుగా రుణమాఫీ చేయకపోవడంపై భారత రాష్ట్ర సమితి చేస్తున్న ఆరోపణలు కూడా అతిశయంగానే ఉంటున్నాయి. అదే సమయంలో ఎందుకు చేయలేకపోయాం అనే విషయంలో రేవంత్ రెడ్డి చెబుతున్న కారణాలు కూడా కుంటి సాకులు గానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.
ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతానని రేవంత్ రెడ్డి అంటుంటే.. అప్పటిలోగా చేయడం సాధ్యం కాదని రేవంత్ సర్కారు దిగిపోవాల్సి వస్తుందని హరీష్ రావు అంటున్నారు. అలా చేయగలిగితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయబోనని హరీష్ చెబుతున్నారు. ఆగస్టు 15లోగా ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తానని హరీష్ రాజీనామాతో సిద్దిపేటకు పట్టిన శనిని వదిలిస్తానని కూడా రేవంత్ రెడ్డి సవాళ్లు విసురుతున్నారు. అందరూ ప్రధానంగా రుణమాఫీ చుట్టే తమ రాజకీయం నడుపుతున్నారు.
కాగా నాలుగు నెలల్లో మొత్తం పాలన మీద ఇది రెఫరెండం అని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం సాహసంతో కూడుకున్న మాట. ఒకవైపు ఆయనే ఈ 4 నెలల్లో తమ అద్భుతాలు చేశామని తను కూడా భావించట్లేదు అని అంటూనే ఉన్నారు.
తాము అద్భుతాలు చేయకపోయినా తప్పులు మాత్రం చేయలేదని బలంగా నమ్ముతున్నామని చెబుతున్నారు. కొన్ని వర్గాలకు తమ పాలన బాగా సంతోషం కలిగించి ఉండవచ్చునని మరికొన్ని వర్గాలకు అంత సంతోషం కలగకపోయి ఉండవచ్చునని కూడా అంటున్నారు. కానీ మేం రాష్ట్ర ప్రజలను నిరాశపరచలేదు- అనే నమ్మకంతోనే ఈ ఎన్నికలనుగా కచ్చితంగా రెఫరెండంగా భావించవచ్చునని చెబుతున్నట్లుగా రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది సాహసోపేతమైన మాటగా కనిపిస్తోంది.
ఒకసారి రెఫరెండం అనే మాట వాడిన తర్వాత.. ఫలితం ఏమాత్రం తేడా కొట్టినా సరే.. విపక్షాలు చాలా దారుణంగా విరుచుకుపడతాయనడంలో సందేహం లేదు. ఉన్న 17 స్థానాలలో రేవంత్ తాము 14 గెలుస్తాం అంటున్నప్పటికీ.. 10 గెలిచినా కూడా.. గొప్ప విజయమే. కనీసం 9కి తగ్గకుండా అత్యధిక సీట్లు తమ ఖాతాలో వేసుకున్నా కూడా రెఫరెండం అనే మాట వాడినందుకు వారికి పరువు దక్కుతుంది. అంతకంటె సీట్లు తగ్గితే.. తీవ్రమైన విమర్శలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది