ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని దశాబ్దాలుగా అట్టిపెట్టుకున్న సొంత సీటు పెందుర్తి నుంచి రూరల్ జిల్లా మాడుగులకు ఆఖరు నిముషంలో బదిలీ చేశారు. బలవంతంగానే ఆయన అక్కడకు వెళ్లారు. తన అత్త గారి ఊరు తనకు తెలిసిన ఊరు అని ఆయన వరసలు కలుపుకుంటూ అందరికీ దగ్గర కావాలని చూసారు.
ప్రచారం కూడా జోరుగానే చేశారు. వర్గ పోరుని కూడా దారిని తెచ్చాను అని అనుకున్నారు. తీరా పోలింగ్ అనంతరం పోస్ట్ మార్టం చూస్తే టీడీపీకి పట్టుకొమ్మల్లాంటి కొన్ని గ్రామాలే వైసీపీ వైపు మళ్ళాయని ప్రచారం సాగుతోంది.
ఒక మేజర్ పంచాయతీలో ఎపుడూ టీడీపీకి ఓట్లేసే వారు అంతా ఈసారి వైసీపీ వైపు మొగ్గారని తెలిసింది అని అంటున్నారు. సొంత పార్టీ నేతలే ప్రత్యర్ధి పార్టీ ప్రలోభాలకు లొంగిపోయి చేయాల్సింది అంతా చేసి పెట్టారని ఆలస్యంగా అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయట.
తనకు ఇదే ఆఖరి అవకాశం గెలిపించండి అంటూ నమ్ముకుని వచ్చిన పెద్దాయన బండారుకు సొంత పార్టీ వారే దెబ్బేశారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇలా అనుకున్న వారు అయిన వారే వెన్నుపోటు పొడిస్తే ఎలా అని పసుపు శిబిరంలో అంతర్మధనం సాగుతోందిట. భారీ నజరానా తోనే ఓట్లు ఇటు నుంచి అటు బదిలీ అయిపోయాయని అంటున్నారు.
దీంతో గతంలో తమకు ఓట్లే పడని ఆ పంచాయతీలో మెజారిటీ మాదే అని వైసీపీ పందేలు కాసే స్థాయికి వెళ్ళిందని అంటున్నారు. ఇక నియోజకవర్గంలో వర్గ పోరు కారణంగా బయటకు పనిచేసినట్లుగా ఉన్నా లోలోపలా వర్క్ సరిగ్గా జరగలేదు అన్న భోగట్టాలూ వినిపిస్తున్నాయట. మరి మాడుగుల హల్వా కోసం ఆశపడి పెందుర్తి నుంచి షిఫ్ట్ అయిన బండారుకు ఇలా రాజకీయ చరమాంకంలో ఇబ్బంది పెడితే గెలుపు ఎలా అన్నదే సైకిల్ పార్టీలో వేదనగా ఉంది.
తక్కువలో తక్కువతో అయినా గట్టెక్కుతామని టీడీపీ నేతలు సర్దిచెప్పుకుంటున్నప్పటికీ రెండు సార్లు వరసగా వైసీపీ గెలిచిన సీటు మాడుగుల. పైపెచ్చు ఆ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న ఈ సీటులో గెలుపు ఆశలు అవకాశాలు ఎంత మేరకు అన్నదే అన్న చర్చకు తెర లేస్తోంది. ఫలితాల తరువాత వెన్నుపోటు వీరులు ఎవరో తేలుతుందని అంటున్నారు.