అధికారంపై వైసీపీలో టీడీపీ బెట్టింగ్స్ సవాల్ టెన్షన్ పుట్టిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ధీమా వుంది. కానీ బెట్టింగ్స్ విషయంలో టీడీపీలో జోష్ కనిపిస్తోంది. ఇక్కడే వైసీపీలో అనుమానం కలుగుతోంది. “అధికారం మాదే… మీది రూపాయి, మాది రూపాయిన్నర, దమ్ముంటే బెట్టింట్స్ పెట్టండి” అని వైసీపీ నాయకులకు టీడీపీ నాయకులు సవాల్ విసురుతున్నారు. ఈ సవాల్‌కు ఎలా స్పందించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో వైసీపీ నేతలున్నారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలా వుందంటూ తమకు తెలిసిన నాయకులను వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. రాయలసీమ నాయకులైతే కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల వారికి, ఆ ప్రాంతీయులైతే సీమ వాసులకు ఫోన్ చేస్తూ… ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం వుందో తెలుసుకుంటున్నారు. అయినప్పటికీ బెట్టింగ్స్ పెట్టడానికి వైసీపీ నుంచి ముందుకు రాని పరిస్థితి.
తమ నాయకుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 150కి పైగా సీట్లు వస్తాయని చెప్పారని, అన్ని కాకపోయినా కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు రావా? అని అధికార పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సవాల్‌ను స్వీకరించి, బెట్టింగ్ వేద్దామా? అని అధికార పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
టీడీపీ బెట్టింగ్ సవాల్‌ను పట్టించుకోని అధికార పార్టీ నాయకులు… తప్పనిసరిగా తమదే అధికారం అని నమ్మకంగా ఉన్నారు. అయితే బెట్టింగ్ విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తున్న మాట నిజం. టీడీపీ నేతలు గతంలో కూడా ఇలాగే అధికారం తమదే అని బీరాలు పలికారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. నాల్గో తేదీ అందరి కథలు బయట పడతాయని అంటున్నారు.