ఎన్నికలకు సంబంధించి పచ్చి నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తే.. కులం, డబ్బు అత్యంత కీలక పాత్ర పోషించాయి. ఈ రెండే ఎన్నికలను శాసించేవని చెప్పక తప్పదు. సంక్షేమ పథకాల రూపంలో ఎంత లబ్ధి చేకూర్చినా, ఎంతో అభివృద్ధి చేసినా … ఓటర్లకు అవేవీ పట్టవన్నది చేదు నిజం. అభివృద్ధి అనేది కేవలం కొంత మంది డిమాండ్‌గా, ఆకాంక్షగా మాత్రమే మారింది. ఇదేమీ ఎన్నికల్లో నేతల తలరాతల్ని మార్చే అంశమని భావించాల్సిన పనిలేదు.
అభ్యర్థి మన కులపోడా అయితే ఓకే. అటు వైపు అభ్యర్థి అభివృద్ధి పనులు బాగా చేసినప్పటికీ, అబ్బే ఓటర్లకు అవేవీ పట్టవు. ఏం మన ఒక్కరి కోసమే రోడ్డు వేశారా? మన ఒక్కరి కోసం తాగునీటి సౌకర్యం కల్పించారా? మన ఒక్కరికే సంక్షేమ పథకాలు అందిస్తున్నారా? ఆ సొమ్ము ఏమైనా సీఎం సొంత డబ్బా? మా కంటే పక్కంటోళ్లకు, ఎదురింటోళ్లకు ఇంకా ఎక్కువ లబ్ధి కలుగుతోంది? అలాంటప్పుడు ఓటు ఎందుకు వేయాలి?.. ఇలాంటి మైండ్ సెట్ ఓటర్లలో చూడొచ్చు.
ఎన్ని సంక్షేమ పథకాలు అందించినా, ఎంత లబ్ధి చేకూర్చినా… ఓట్ల రోజు మాత్రం ఓటుకు ఎంత ఇచ్చారన్నదే ముఖ్యం. అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తారని అనుకోవడం ఉత్త భ్రమ. ఓటర్ల లెక్కలు వేరుగా వుంటాయి. ఇటీవల కాలంలో కులపిచ్చి బాగా పెరిగింది. చిన్న ఉదాహరణ.. గుమ్మనూరు జయరామే. కర్నూలు జిల్లా ఆలూరు టికెట్‌ను ఆయనకు ఇవ్వడానికి సీఎం జగన్ నిరాకరించారు. అదే నాయకుడిని చంద్రబాబు తన పార్టీలో చేర్చకుని గుంతకల్లు సీటు కట్టబెట్టారు.
గుమ్మనూరు సామాజిక వర్గం బోయ. ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గుంతకల్లు నియోజక వర్గంలో ఎక్కువగా ఉన్నారని, అలాగే ఆయన వద్ద బాగా డబ్బు ఉందనే కారణంతో ఎంత వ్యతిరేకత వస్తున్నా జయరాం వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. అలాగే నరసారావుపేట ఎంపీ టికెట్‌ను మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు ఇవ్వడానికి కారణం… కేవలం సామాజిక వర్గమే. యాదవులు ఎక్కువ ఉన్నారనే కారణంతో సిటింగ్ ఎంపీ కృష్ణదేవరాయుల్ని కాదని అనిల్ వైపు జగన్ నిలిచారు.
ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. చంద్రబాబునాయుడు ఆకాశం నుంచి చందమామను తీసుకురావడం ఒక్కటే తక్కువ. అంత గొప్పగా అభివృద్ధి చేశారనే ప్రచారం జరిగింది. చివరికి ఏమైంది… రాజధాని ప్రాంతంలో కూడా టీడీపీని ఓడించారు. మరీ ముఖ్యంగా బాబు కుమారుడైన లోకేశ్‌ను మంగళగిరిలో ప్రజలు తిరస్కరించారు.
అభివృద్ధి వ్యతిరేకిగా వైఎస్ జగన్‌ను చిత్రీకరించారు. మరెందుకని ఆయన్ను బలమైన నాయకుడిగా భావించి, ఏకంగా మూడు పార్టీలు కలిసి కూటమి కట్టాయో జవాబు చెప్పాల్సిన అవసరం వుంది. అంటే ఓటర్ల సమీకరణలు వేరు. ఓటర్ల మనసెరిగి సామాజిక సమీకరణలు చేసి, ఇతరత్రా సమకూర్చుకుని ఎన్నికల సమరానికి దిగాల్సి వుంటుందని కళ్లెదుటే ఎన్నో అనుభవాలున్నాయి. మీడియా కోసం మాట్లాడే వాటిలో కొన్నే నిజాలుంటాయి. ఆచరణ వేరే. ఎవరెన్ని చెప్పినా దేశ వ్యాప్తంగా కులం, మతం, డబ్బు… ఇవే మన ఎన్నికలను శాసిస్తున్నాయనేది వాస్తవం.