ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ, వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఎవరి లెక్కలు వారివి. ఈ సందర్భంగా చంద్రబాబుకు వచ్చే సీట్లు ఎన్నో కూడా విజయసాయిరెడ్డి చెప్పడం గమనార్హం. రాజ్యసభ సభ్యుడైన ఆయన నెల్లూరు లోక్‌సభ నుంచి వైసీపీ తరపున ఆయన బరిలో దిగిన సంగతి తెలిసిందే. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో ఆయన తలపడ్డారు.
వచ్చే నెల నాల్గో తేదీ ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, ఆ తారీఖుతో టీడీపీ సీట్లను విజయసాయిరెడ్డి ముడిపెట్టడం చర్చనీయాంశమైంది. విజయసాయి ఎక్స్ వేదికగా సీట్లపై పెట్టిన పోస్టు ఏంటంటే…
“చంద్రబాబూ…! పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే. ఈ సారి మా వాళ్ళను నలుగురిని ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నది. ఈ సారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ? ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి…నీ మీద జాలేస్తోంది!”
ఇదీ విజయసాయిరెడ్డి లెక్క. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేశారని బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిపై అనర్హత వేటు కూడా వేశారు. ఇదే సందర్భంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డికి నెటిజన్లు గుర్తు చేస్తుండడం గమనార్హం. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో నాయకులు మాటలు పక్కన పెడితే, నిజమైన లెక్కలు తెలుసుకోడానికి గట్టిగా పది రోజులు వెయిట్ చేస్తే సరి.